Begin typing your search above and press return to search.

కుక్కను ఢీకొంటే వందేభారత్ ట్రైన్ దెబ్బ తినటమా?

దేశ ప్రధానమంత్రి కలల పంటగా చెప్పే వందే భారత్ గురించి..దాని ప్రత్యేకత గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   7 July 2025 1:00 PM IST
కుక్కను ఢీకొంటే వందేభారత్ ట్రైన్ దెబ్బ తినటమా?
X

దేశ ప్రధానమంత్రి కలల పంటగా చెప్పే వందే భారత్ గురించి..దాని ప్రత్యేకత గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే రైలుగా వందే భారత్ కు ఉన్న గుర్తింపు తెలిసిందే. ఈ రైలు ఇస్పెషల్స్ చాలానే ఉన్నా.. దానికి సంబంధించి అప్పుడప్పుడు బయటకు వచ్చే అంశాల్ని చూసినప్పుడు అవాక్కు కాక తప్పదు. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే.. ఔరా అనుకోకుండా ఉండలేం.

విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం కుక్కను ఢీ కొంది. సాధారణంగా రైళ్లు కుక్కల్ని మాత్రమే కాదు.. ఎద్దులు..బర్రెలు లాంటి భారీ జంతువుల్ని ఢీకొట్టే ఉదంతాల గురించి తెలిసిందే. ఆ సందర్భంలో సదరు రైలు ముందు భాగానికి జరిగే నష్టం పెద్దగా ఉండదు. కానీ.. తాజా ఉదంతం మరీ సిల్లీగా అనిపించక మానదు.

ఎందుకుంటే.. చీరాల రైల్వే స్టేషన్ వద్ద కుక్కను ఢీ కొన్న వందేభారత్ ట్రైన్.. కాస్త దూరం వెళ్లి ఆగిపోయింది. దీనికి కారణం.. కుక్కను ఢీ కొన్న వేళ.. ప్రెజర్ బాక్సును బలంగా తాకటంతో శునకం కళేబరం ఫ్రంట్ భాగం లో ఇరుక్కుపోయింది .దీంతో.. ట్రైన్ కాస్త దూరం వెళ్లి ఆగిపోయింది. దీంతో.. చెన్నైలోని నిపుణుల సలహా మేరకు రైల్వే సిబ్బంది రిపేర్లు చేయటంతో రైలు ముందుకు కదలింది. ఈ ఉదంతాన్ని చూసిన ప్రత్యక్ష సాక్ష్యులు మాత్రం వందే భారత్ రైలు మరీ ఇంత సున్నితమా? అంటూ అవాక్కు అవుతున్న పరిస్థితి.

మరో ఉదంతంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ను ఎద్దును ఢీ కొంది. పట్టాల మీదకు అడ్డంగా వచ్చిన ఎద్దును..వేగంగా వెళుతున్న వందే భారత్ రైలు ఢీ కొంది. ఈ ఉదంతంలో ఇంజిన్ ముందు ఉన్న క్యాటిల్ గార్డ్ కొంత భాగం విరిగిపోయింది. దీంతో.. రైలు కొన్ని నిమిషాల పాటు ఆగిపోయింది. మరమ్మత్తులు చేసిన తర్వాత యథావిధిగా పరుగులు తీసింది. ఏమైనా.. ఒకే రోజు వేర్వేరు ప్రదేశాల్లో ఒకేలాంటి పరిణామాలు చోటు చేసుకోవటం.. ఈ రెండు ఉదంతాల్లో వందేభారత్ ట్రైన్ దెబ్బ తినటం చర్చనీయాంశంగా మారింది. బర్రెను ఢీ కొన్న వేళ.. వందేభారత్ ముందు భాగం దెబ్బ తినటాన్ని అర్ధం చేసుకోవచ్చు.కానీ. .కుక్కను ఢీ కొని కూడా ఆగిపోవటమే ఇప్పుడు వందే భారత్ మీద కొత్త అనుమానాలు వచ్చేలా పరిస్థితి ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.