జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంచార్జి
విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంలో సరికొత్త రాజకీయం సాగుతోంది. జనసేన ఎమ్మెల్యేగా విశాఖ దక్షిణం నుంచి 2024 ఎన్నికల్లో వంశీ క్రిష్ణ శ్రీనివాస్ గెలిచారు.
By: Tupaki Desk | 19 May 2025 9:35 AM ISTవిశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంలో సరికొత్త రాజకీయం సాగుతోంది. జనసేన ఎమ్మెల్యేగా విశాఖ దక్షిణం నుంచి 2024 ఎన్నికల్లో వంశీ క్రిష్ణ శ్రీనివాస్ గెలిచారు. ఆయన ఎన్నికలకు కొద్ది నెలల క్రితం దాకా వైసీపీలో ఉన్నారు. అలా వైసీపీ నుంచి జనసేనలోకి మారి దక్షిణం టికెట్ సాధించారు.
ఇక పొత్తు పెట్టుకుని కూటమి పార్టీలు అన్నీ పోటీ చేయడంతో వంశీకి గెలుపు నల్లేరు మీద నడకగా మారింది. తూర్పు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఓటమిని చూసిన ఆయన చివరి క్షణంలో దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గంకు మారినా గెలిచారూ అంటే దానికి కారణం టీడీపీకి ఉన్న సంస్థగత బలం అని అంటున్నారు.
విశాఖ సౌత్ నియోజకవర్గం 2009లో ఏర్పాటు అయిన తరువాత ఒకే ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. ఆ తరువాత రెండు ఎన్నికల్లో టీడీపీకి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచారూ అంటే అది టీడీపీకి ఉన్న సంస్థాగత బలం క్యాడర్ నిబద్దహ్త అని అంటారు. ఆయన 2019లో వైసీపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని గెలిచారు. అయితే ఆ తరువాత వైసీపీలోకి ఫిరాయించారు.
దాంతో ఆయన అయిదేళ్ళ పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా క్యాడర్ మాత్రం ఆయనతో కలసి నడవలేదు. వారు టీడీపీలోనే కొనసాగారు. దాంతో 2024 ఎన్నికల్లో కసిగానే వాసుపల్లిని టీడీపీ క్యాడర్ ఓడించారు. దాతో పొత్తులో ఉన్న జనసేనకు ఈ పరిణామలౌ బాగా కలసివచ్చాయి. వాసుపల్లి మీద వ్యతిరేకత జనసేన నేత వంశీకి అద్భుతమైన మెజారిటీగా 65 వేల ఓట్లను సాధించిపెట్టింది.
ఇంకో వైపు చూస్తే గెలిచిన తరువాత నుంచి వంశీ జనసేన ఎమ్మెల్యేగానే ఉంటున్నారు అని విమర్శలు ఉన్నాయి. కూటమి పార్టీలకు న్యాయం చేయడం లేదని ప్రత్యేకించి తన గెలుపునకు కారణం అయిన టీడీపీ క్యాడర్ కి అందుబాటులో ఉండడంలేదని విమర్శలు ఉన్నాయి.
దాంతో పాటుగా నామినేటెడ్ పదవులు కూడా టీడీపీకి దక్కలేదన్న అసంతృప్తి ఉందిట. ఈ నేపధ్యంలో దక్షిణం టీడీపీ ఇంచార్జిగా ఉన్న సీతం రాజు సుధాకర్ తన పవర్ ని చూపిస్తున్నారు. ఆయన ఎంపీ భరత్ వర్గం వారు కావడంతో దూకుడుగా దక్షిణంలో రాజకీయం చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే వంశీకి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనంలోకి వెళ్తున్నారు.
దీంతో ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇలా ఈ ఇద్దరి మధ్యన సాగుతున్న పోరుతో దక్షిణంలో రాజకీయం వేడెక్కుతోంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీయే పోటీ చేస్తుందని ఇప్పటికే తమ్ముళ్ళకు టీడీపీ ఇంచార్జి చెబుతున్నారుట.
అయితే వంశీ తనకంటూ ఒక నియోజకవర్గం ఉండాలని దక్షిణాన్ని ఆయన పర్మనెంట్ చేసుకోవాలని చూస్తున్నారుట. ఈ ఆధిపత్య పోరులో పడి విశాఖ దక్షిణం నలుగుతోంది అని అంటున్నారు. దక్షిణంలో వైసీపీ వీక్ గా ఉండడంతో కూటమిలో పోరు సాగుతున్నా కూడా దానిని సొమ్ము చేసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇంకా నాలుగేళ్ళకు వచ్చే ఎన్నికల కోసం కాకుండా రెండు పార్టీల నేతలూ ప్రజల కోసం సమస్యల మీద పనిచేయాలని అంతా కోరుతున్నారు.
