బెయిల్ వచ్చాకా.. వంశీకి వేధింపులు తప్పట్లేదా?
వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి.. ఇటీవల బెయిల్ మీద విడుదలయ్యారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
By: Tupaki Desk | 13 July 2025 9:27 AM ISTవివిధ కేసుల్లో జైలుకు వెళ్లి.. ఇటీవల బెయిల్ మీద విడుదలయ్యారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయనకు వేధింపులు తప్పట్లేదని చెబుతున్నారు. పోలీసుల్ని అడ్డు పెట్టుకొని కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామమే నిదర్శనమని చెబుతున్నారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఒకటి ఉంది. వంశీని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు మండిపడుతుంటే.. వారిని బుజ్జగిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన దారిన తాను వెళ్లిపోయారు వంశీ. ఇంతకూ అసలేం జరిగిందంటే..
కోర్టు నుంచి బెయిల్ అందుకున్న నేపథ్యంలో జైలు నుంచి విడుదలయ్యారు వంశీ. అయితే..కోర్టు ఆదేశాల నేపథ్యంలో క్రైం నెంబరు 142/25 మైనింగ్ కేసులో వంశీ విచారణ కోసం గన్నవరం పోలీసు స్టేషన్ కు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్టేషన్ కు వెళ్లిన ఆయన సంతకాలు చేశారు. విచారణ అధికారి పోలీస్ స్టేషన్ కు రాకపోవటంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
దాదాపు మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్ కు కూర్చొండిపోయారు వంశీ. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని.. ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని.. త్వరగా విచారించి పంపేయాలని వంశీ మద్దతుదారులు.. అభిమానులు పోలీసుల్ని కోరారు. విచారణ అధికారి రాకుండా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని పోలీసు సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో మూడు గంటలకు పైనే పోలీస్ స్టేషన్ లో ఉండిపోయారు వంశీ.
చివరకు సదరు విచారణ అధికారి స్టేషన్ కు రారని.. విచారణ కోసం వంశీ స్టేషన్ కు ఎప్పుడు రావాలో తాము లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పటంతో వంశీ వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల్ని అడ్డు పెట్టుకొని కూటమి సర్కారు వంశీని వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు. అయితే.. వారిని వంశీ సముదాయించారే కానీ ఒక్క విమర్శ కూడా చేయకుండా పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా విజయవాడ ఆసుపత్రికి వెళ్లారు. మొత్తంగా వంశీ వ్యవహారంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని వైసీపీ వర్గాలు ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నాయి.
