ముఖ్యమంత్రి గారూ...మారుతున్న వంశీ గానం !
వల్లభనేని వంశీ రెండు సార్లు ఎమ్మెల్యేగా గన్నవరం నుంచి గెలిచినది టీడీపీ నుంచే. ఆయన 2019 తరువాత వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు.
By: Satya P | 24 July 2026 9:05 AM ISTవల్లభనేని వంశీ రెండు సార్లు ఎమ్మెల్యేగా గన్నవరం నుంచి గెలిచినది టీడీపీ నుంచే. ఆయన 2019 తరువాత వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. అంతటితో ఆగకుండా ఏకంగా చంద్రబాబు మీద లోకేష్ మీద వ్యక్తిగత విమర్శలకు దిగారు. అది ఎంతదాకా వెళ్ళిందో అందరికీ తెలిసిందే. బాబు అయితే అసెంబ్లీ నుంచి ఒకసారి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తన ఆవేదన వ్యక్తం చేశారు. కౌరవ సభకు వెళ్ళేది లేదని కూడా భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఆ తరువాత తిరిగి సీఎం గానే ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయిన వంశీ కూటమి ప్రభుత్వం వచ్చాక జైలు పాలు అయ్యారు. ఆ తరువాత ఆయన బయటకు వచ్చినా వైసీపీలో యాక్టివ్ గా లేరు. ఇక ఇటీవల కాలంలో ఆయనలో వచ్చిన మార్పు అయితే చర్చనీయాంశం అయింది. ముఖ్యమంత్రిగారూ అంటూ చంద్రబాబుకు లేఖలు రాస్తున్నారు.
వైసీపీ వేస్ట్ అంటే :
లేటెస్ట్ గా వంశీ పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని దీ బెస్ట్ అని కొనియాడారు. దానిని ఆయన ప్రస్తుతం ఉంటున్న వైసీపీ అయితే వేస్ట్ ప్రాజెక్ట్ అంటోంది. కేవలం టీడీపీ వారి ఆర్థిక ప్రయోజనాల కోసమే దానిని చేపట్టారని కూడా 2014 నుంచి 2019 మధ్యలో విమర్శిస్తూ వచ్చింది. కానీ వైసీపీలో ప్రస్తుతం ఉన్న వంశీ మాత్రం పట్టిసీమ భేష్ అంటున్నారు. ఆయన ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పట్టిసీమ ద్వారా సాగునీటి సరఫరాను గన్నవరంలోని ఎత్తైన ప్రాంతాల రైతులకు కూడా అందేలా చూడాలని కోరారు. పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా వారికి నీరు అందించాలని పేర్కొన్నారు.
రైతాంగానికి మేలు :
పట్టిసీమ ద్వారా కృష్ణా నదిని మళ్ళింపుతో కృష్ణా డెల్టా రైతులకు ఎంతో మేలు జరిగింది అని కూడా వంశీ ప్రశంసించారు. ప్రస్తుతం ఎటు చూసినా కరవు ఉందని ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఎంతో బగా ఉపయోగపడుతోంది అని వంశీ గుర్తు చేశారు. తాను గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నపుడు పోలవరం కుడి కాలువ నీటిని దగ్గరలోని ఎత్తైన ప్రాంతాల గ్రామాలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అప్పట్లో చంద్రబాబుని కోరానని వంశీ గుర్తు చేశారు. ఇక పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పధకానికి స్థానిక రైతులు కూడా తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చారని చెబుతూ వారికి కూడా సాగు నీరు అందచేస్తామని నాడు బాబు చెప్పారని అన్నారు. అది అలాగే కొనసాగిందని అన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా :
అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఎత్తైన ప్రాంతాల రైతులకు పట్టిసీమ ద్వారా నీరు అందింది అని ఆయన చెప్పారు. కానీ ఈ ఏడాది మాత్రం నీటిపారుదల శాఖ అధికారులు పోలీసుల సహకారంతో పంప్ సెట్ల నిర్వహణను అడ్డుకున్నారని వంశీ ఆరోపించారు. దీంతోనే గన్నవరం పరిసరాలోని ఎత్తైన ప్రాంతాలకు పట్టిసీమ నీటి సరఫరా నిలిచిపోయిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో నీటి సరఫరాను నిలిపివేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని వంశీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల రైతుల ప్రయోజనాల దృష్ట్యా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆయన సీఎం కి రాసిన లేఖలో కోరడం విశేషం. ఎత్తు ప్రాంతాలకు సాగు నీరు సరఫరా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మొత్తానికి వంశీ ప్రజల సమస్య మీద అయినా ముఖ్యమంత్రి గారూ అని లేఖలు రాయడం పట్టిసీమ ప్రాజెక్టుని పొగడడం వంటి చర్యలు చర్చనీయాంశం అవుతున్నారు. వంశీ గానం మారుతోందా అన్న దాని మీద డిస్కషన్ సాగుతోంది అంటున్నారు.
