అయ్యో వంశీ....ఎలాగైపోయావ్ స్వామీ !
ఇక రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని అంటున్నారు. జైలులో ఆయన గదిలో ఉన్నపుడు పల్స్ రేటు ఒక్కోసారి తగ్గిపోతోందని అంటున్నారు.
By: Tupaki Desk | 14 May 2025 9:44 PM ISTవల్లభనేని వంశీ. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత. ఆయన గురించి ఏపీ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వారికి వేరేగా చెప్పాల్సిన పని లేదు. వంశీ రాజకీయంగా చూస్తే ఫైర్ బ్రాండ్ కూడా. ఆయన ఒకానొక దశలో ప్రతీ నిత్యం వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. వైసీపీలోకి వచ్చాక మరో మాజీ మంత్రి కొడాలి నానికి ధీటుగా నిలిచి అప్పటి ప్రతిపక్ష టీడీపీ మీద పదునైన మాటలనే బుల్లెట్లుగా వేసేవారు.
అయితే అదంతా గతం. ఇపుడు వర్తమానం. మరి వంశీ ఇపుడు ఎలా ఉన్నారు అంటే అయ్యో వంశీ అనుకోవాల్సి వస్తోంది. ఫిబ్రవరి 23న అరెస్ట్ అయిన వంశీకి బెయిల్ ఒక కేసులో వచ్చింది. కానీ ఇంకా ఆయన విడుదల కాలేదు. మరికొన్ని కేసులలో రావాల్సి ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే వంశీని జైలు నుంచి కోర్టు దాకా తీసుకుని వస్తున్నపుడు ఆయనను చూసిన వారు అంతా అయ్యో వంశీ అనుకుంటున్నారు.
ఇక మీడియాలో ఆయన ఫోటోలను చూసిన వారు నెటిజన్లు అయితే ఏమైంది వంశీకి అని అనుకునే నేపధ్యం ముంది. వైసీపీ అధినేత జగన్ అన్నారని కాదు కానీ వంశీ అందగాడే. ఆయన ఎర్రగా బుర్రగా సినిమా హీరోకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటారు. ఆయన 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. పదిహేనేళ్ళకు పైబడిన రాజకీయం రాటు దేలిన రాజకీయం.
కానీ అదే దూకుడు రాజకీయాల్లో ఆయనకు మేలు ఎంత చేసిందో కానీ ప్రస్తుత పరిస్థితికి కారణం అని అంటున్నారు. తాజాగా పోలీసులు వంశీని కోర్టుకు తీసుకుని వస్తున్నపుడు ఆయనను చూసిన వారు అంతా వంశీ మీద ఒక విధంగా సానుభూతినే చూపిస్తున్నారు. అయ్యో ఇలాగైపోయారేంటి స్వామీ అని అంటున్న వారు ఉన్నారు.
నల్లని జుత్తుతో షేవ్ చేసిన గడ్డంతో పెద్ద కళ్ళతో సూటిగా చూసే చూపుతో వంశీ ఆకర్షణీయంగా ఉండేవారు. ఏపీ జనాలకు ఆ వంశీయే తెలుసు. కానీ ఈ వంశీ జుత్తు అంతా పండిపోయి ఉన్నారు. అంతే కాదు తరచూ దగ్గుతున్నారు. అత్యంత బలహీనంగా కనిపిస్తున్నారు. ఒక్కసారిగా పదేళ్ళ వయసు మీదపడినట్లుగా కూడా ఉన్నారు.
ఇక రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని అంటున్నారు. జైలులో ఆయన గదిలో ఉన్నపుడు పల్స్ రేటు ఒక్కోసారి తగ్గిపోతోందని అంటున్నారు. ఇదే విషయం మీద వంశీ న్యాయవాదులు కూడా ఆయనకు బెయిల్ కోరుతున్నారు. అయితే దాదాపుగా వంద రోజులకు చేరువ అవుతున్నా వంశీ జైలు గోడల మధ్యనే మగ్గుతున్నారు.
నిజంగా ఆయనకు ఇది జీవితంలో అత్యంత బాధాకరమైన అధ్యాయమే అని అంటున్నారు. జాతకంలో మార్పులు ఉంటే ఇలాగే ఉంటుందని అంటున్నారు. వంశీకి ఇపుడు బ్యాడ్ టైం నడుస్తోంది అని అంటున్నారు. అందుకే ఆయన ఇలా తన రూపు తనకే ఆశ్చర్యం అనిపించేలా మారిపోయారు అని అంటున్నారు.
ఏది ఏమైనా వంశీకి విధించిన ఈ శిక్ష చాలు అని ఆయన అభిమానులు అంటున్నారు . మరి ఆయన మీద కేసులు చట్టప్రకారం ఎలా తేలాల్సి ఉన్నాయో కోర్టు వాటి మీద ఏ విధంగా స్పందించి బెయిల్ ఇస్తుందో చూడాలి. మొత్తానికి వంశీ ఏపీ రాజకీయాలో ఒక స్పెషల్ స్టడీ కేసు అంటున్నారు. రాజకీయాల్లో అధికారంలో ఉన్న వారు ఎలా ఉండాలి. ఎలా ఉండకపోతే తదుపరి పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్న దానికి వంశీయే నిట్ట నిలువు ఉదాహరణ అంటున్నారు.
