జగన్ తో వల్లభనేని వంశీ భేటీ.. అండగా నిలిచినందుకు ధన్యవాదాలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని కలిశారు.
By: Tupaki Desk | 3 July 2025 2:46 PM ISTగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని కలిశారు. బుధవారం విజయవాడ జైలు నుంచి విడుదలైన వంశీ గురువారం తాడేపల్లి వచ్చారు. మాజీ సీఎం జగన్ ను కలిసి కష్టకాలంలో అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. వంశీని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న జగన్ యోగక్షేమాలపై ఆరా తీశారు. వంశీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. సుమారు 140 రోజులుపాటు జైలులో ఉన్న వంశీ బుధవారం విడుదలయ్యారు. వంశీపై మొత్తం 11 కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 13న కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీ సుమారు 140 రోజులు జైలులో రిమాండ్ ఖైదీగా ఉండాల్సివచ్చింది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఆయనపై వరుసగా 11 కేసులు నమోదు చేయడంతో వంశీ సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. ఎట్టకేలకు అన్ని కేసులలో ఆయనకు బెయిలు లభించింది. అయితే మైనింగ్ కేసులో ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిలును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.
అయితే హైకోర్టు బెయిలు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడంతో వంశీ విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో బుధవారం ఆయన విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. తన న్యాయవాదితోపాటు భార్య పంకజశ్రీతో కలిసి జైలు నుంచి ఇంటికి వెళ్లిపోయారు వంశీ. ఆయన విడుదల సమయంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు జైలు వద్దకు వచ్చినప్పటికీ వారితో ముక్తసరిగానే మాట్లాడి వెళ్లిపోయారు వంశీ. ఒక రోజు విశ్రాంతి అనంతరం పార్టీ అధినేత జగన్ ను తాడేపల్లిలో కలిశారు.
వంశీ అరెస్టు అయిన తర్వాత విజయవాడ జైలులో అధినేత జగన్ కలిశారు. వంశీతో ములాఖత్ అయ్యారు. పార్టీ తరఫున న్యాయ సహాయం చేస్తామని, అండగా నిలుస్తామని ప్రకటించారు. వంశీ భార్య పంకజశ్రీకి గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో వంశీ అనారోగ్యం పాలైనప్పుడు పార్టీ తరపున కోర్టుకు వెళ్లి ఆయనకు వైద్య సహాయం అందేలా చేశారు. ఈ నేపథ్యంలో తనకు అండగా నిలిచినందుకు వంశీ మాజీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. భార్య పంకజశ్రీతో కలిసి ఆయన జగన్ వద్దకు వెళ్లారు.
