వంశీ అనుచరుల కోసం మొదలైన వేట.. ఆ నలుగురి కోసం రంగంలోకి పోలీసులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల కోసం పోలీసులు వేటాడుతున్నారు.
By: Tupaki Desk | 2 Dec 2025 4:09 PM ISTగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో నిందితులైన వంశీ అనుచరులు గత పది నెలలుగా పరారీలో ఉన్నారు. మొత్తం ఆరుగురు నిందితులు పరారీలో ఉంటే.. వారిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. దీంతో ఇద్దరు నిందితులు తమపై వారెంట్లను రీకాల్ చేయించుకోడానికి సోమవారం కోర్టుకు రాగా, వారిని రిమాండుకు పంపిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు చేశారు. దీంతో ఇంకా పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులు టెన్షన్ మొదలైందని అంటున్నారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకోమని బెదిరిస్తూ ముదునూరి సత్యవర్ధన్ ను నిందితులు కిడ్నాప్ చేశారని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. హైదరాబాదులో ఉన్న సత్యవర్థన్ ను విజయవాడ రప్పించి కిడ్నాప్ చేశారని, బాధితుడు సత్యవర్థన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసును ప్రభుత్వం సీరియసుగా తీసుకోవడంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు ఆయన అనుచరులైన కొమ్మా కోటేశ్వరరావు, తేలప్రోలు రాము, వజ్రకుమార్, ఎర్రంశెట్టి రామాంజనేయులు, చేబ్రోలు శ్రీనివాసరావు, వేణును నిందితులుగా గుర్తించింది. నిందితుల్లో వంశీని అప్పట్లోనే అరెస్టు చేశారు. ఈ కేసు రాష్ట్రంలో పెను సంచలనమైంది. ఇక వంశీ అరెస్టు తర్వాత ఆయన ప్రధాన అనుచరులు ఆరుగురు పరార్ అయ్యారు.
వీళ్లంతా గత పది నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. వారి అరెస్టుపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో ఇటీవల నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. వంశీ అరెస్టు తర్వాత ఇళ్లను వదిలి వెళ్లిపోయిన ఆరుగురు నిందితులు ముందస్తు బెయిలు కోసం తెగ ప్రయత్నాలు చేశారు. అయితే, వారి ప్రయత్నాలు ఏవీ ఫలించకపోగా, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీతో అరెస్టు తప్పనిసరి పరిస్థితి ఎదురైందని అంటున్నారు. దీంతో అరెస్టు తప్పదని భావించిన నిందితులు తేలప్రోలు రాము, వజ్రకుమార్ వారెంట్ రీకాల్ చేయించుకోవడానికి సోమవారం కోర్టుకు హాజరయ్యారు. వీరి పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోని న్యాయాధికారి భాస్కరరావు 15 రోజుల రిమాండ్ విధిస్తూ సంచలన ఆదేశాలు ఇచ్చారు. దీంతో మిగిలిన నిందితుల్లో టెన్షన్ ఎక్కువైంది.
ప్రస్తుతం ఇద్దరికి రిమాండ్ పడటంతో మిగిలిన నలుగురి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. వంశీని అరెస్టు చేయించిన ప్రభుత్వం తమ విషయంలో మొతక వైఖరి అవలంబిస్తుందని ఇన్నాళ్లు నిందితులు ఎదురుచూశారని అంటున్నారు. అయితే వంశీని ఏ విధంగా ట్రీట్ చేశారో.. ఆయనకు కొమ్ముకాసిన వారికి అదేవిధమైన ట్రీట్మెంట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందడంతో నిందితులు ముందస్తు బెయిలు ప్రయత్నాలు చేస్తూ వచ్చారని చెబుతున్నారు. అయితే ఈ విషయంలోనూ ప్రభుత్వ అధికారుల సహకారం అవసరం ఉండటంతో నిందితులకు ఉపశమనం దక్కలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ కావడంతో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోవడం ఒక్కటే మార్గం కనిపిస్తోందని న్యాయవాద వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
