ఆ కేసులో 4.30 గంటల విచారణ.. వల్లభనేని వంశీ ఏం చెప్పారు?
2019 ఎన్నికల సమయంలో క్రిష్ణా జిల్లా బాపులపాడు మండలంలో వివిధ గ్రామాల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంచారన్న కేసు నమోదైంది.
By: Tupaki Desk | 24 May 2025 11:03 AM ISTఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా కేసుల మీద కేసులు మీద పడుతూ.. జైల్లో కంటిన్యూ అవుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా ఒక కేసు విచారణలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా నాలుగున్నర గంటల విచారణలో 20 ప్రశ్నల్ని సంధించినా.. ఆయన నుంచి మాత్రం ఒకే సమాధానం మార్చి మార్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. వంశీ వైఖరితో పోలీసులకు చుక్కలు కనిపించినట్లుగా చెబుతున్నారు. ఇంతకూ ఆ కేసేమిటి? పోలీసుల విచారణలో ఏం జరిగింది? వంశీ వైఖరికి పోలీసుల స్పందన ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని చూస్తే..
2019 ఎన్నికల సమయంలో క్రిష్ణా జిల్లా బాపులపాడు మండలంలో వివిధ గ్రామాల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంచారన్న కేసు నమోదైంది. దీనిలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీని.. ఈ కేసు విచారణ కోసం రెండు రోజులు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం విజయవాడలోని జిల్లా జైలు నుంచి హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకొని కంకిపాడుకు తీసుకొచ్చారు.
తొలుత వైద్యపరీక్షలు నిర్వహించి కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ పర్యవేక్షణలో హనుమాన్ జంక్షన్ సీఐ విచారణ చేశారు. ఇందులో భాగంగా ఇరవై ప్రశ్నల్ని నాలుగున్నర గంటల వ్యవధిలో సంధించినా వంశీ నోటి నుంచి సరైన సమాధానం రాలేదని చెబుతున్నారు. విచారణ వేళ వంశీతో పాటు లాయర్లు కూడా ఉన్నారు.
ప్రతి ప్రశ్నకు తనకు ఒకేలాంటి సమాధానాన్ని మార్చి మార్చి చెప్పినట్లుగా సమాచారం. ‘‘నాకేం తెలీదు, నాకు సంబంధం లేదు’’ లాంటి సమాధానాల్నే ఇస్తున్న వంశీ వైఖరితో పోలీసుల సహనానికి పరీక్షగా మారాయని చెబుతున్నారు. విచారణ రెండో రోజు ఇవాళ జరగనుంది. మరి.. ఈ రోజు విచారణలో వంశీ ఏం చెబుతారో చూడాలి. రెండో రోజు కూడా విచారణ ఉండటంతో వంశీని కంకిపాడు స్టేషన్ లోనే ఉంచారు. అయితే.. వంశీకి శ్వాస సంబంధిత సమస్య ఉండటంతో సీపాప్ పరికరాన్ని వినియోగించుకునేందుకు వీలుగా కోర్టు అనుమతి ఇచ్చింది.
