Begin typing your search above and press return to search.

వంశీకి దక్కని ఊరట.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలు జీవితం తప్పడం లేదు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను నూజివీడు కోర్టు తిరస్కరించింది.

By:  Tupaki Desk   |   26 May 2025 4:06 PM IST
వంశీకి దక్కని ఊరట.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ
X

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలు జీవితం తప్పడం లేదు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను నూజివీడు కోర్టు తిరస్కరించింది. దీంతో వంశీ మరికొన్నాళ్లు రిమాండులో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వంశీ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నూజివీడు కోర్టు తీర్పును ఆయన జిల్లా కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 13న కిడ్నాప్ కేసులో విజయవాడ వెస్ట్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఆయన సొంత ప్లాట్ లో అరెస్టు చేసిన పోలీసులు అదే రోజు విజయవాడ తరలించారు. అప్పటి నుంచి విజయవాడ జిల్లా జైలులో వంశీ రిమాండు ఖైదీగా ఉంటున్నారు. వంశీపై మొత్తం ఏడు కేసులు నమోదుచేయగా, ప్రస్తుతానికి ఐదు కేసుల్లో బెయిలు లభించింది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల కేసుతోపాటు అక్రమ మైనింగ్ కేసుల్లో వంశీకి బెయిలు దక్కాల్సివుంది.

వంశీపై నమోదైన కేసులో ఇంకా పూర్తి విచారణ జరపాల్సివున్నందున బెయిల్ ఇవ్వలేమని నూజివీడు కోర్టు స్పష్టం చేసింది. కాగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వంశీని మెరుగైన చికిత్స నిమిత్తం పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వంశీ పరిస్థితిపై ఆయన భార్య పంకజశ్రీతోపాటు వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వంశీ ఆరోగ్యం దిగజారడానికి ప్రభుత్వమే కారణమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో ట్వీట్ చేసింది. వల్లభనేని వంశీ ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆట ఆడుతోందని, జైల్లో శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న వంశీకి మెరుగైన చికిత్స అందించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించింది. ఇలా ప్రాణాలతో చెలగాటమేంటి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.

మరోవైపు వంశీకి గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సంచలన విషయాలను వెల్లడించారు. న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్న వంశీకి ఫిట్స్ ఉందని డాక్టర్లు తేల్చారు. ఆయనకు నిద్రలో శ్వాస ఆగిపోతోందని గుర్తించారు. దీనిపై లోతైన పరీక్షలు నిర్వహించాల్సివుందని నివేదించారు. వంశీకి స్లీప్ టెస్ట్ నిర్వహించాల్సివుండగా, గుంటూరు జీజీహెచ్ లో ఆ సౌకర్యం లేదని డాక్టర్లు వెల్లడించారు. అయితే వంశీ ఆరోగ్యంపై పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

కాగా, వంశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. దాదాపు వంద రోజులుగా జైల్లో ఉన్న వంశీ పూర్తిగా నీరసించిపోయారు. తరచూ దగ్గుతున్నారు. ఇటీవల కంకిపాడు పోలీసుస్టేషన్ లో విచారణ నిమిత్తం తీసుకువెళ్లగా వాంతులు చేసుకున్న ఆయనను అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించాల్సివుంది. ఈ సమయంలోనే వంశీ చావు కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణ చేశారు. మొత్తానికి వంశీపై నమోదవుతున్న వరుస కేసులతో ఆయన ఎప్పుడు బయటకు వస్తారనేది సస్పెన్స్ గా మారింది. వంశీ అనారోగ్యం దృష్టిలో పెట్టుకుని అయినా బెయిల్ మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.