వంశీ మౌనంగా కారెక్కి వెళ్ళిపోయారు !
వీటి సంగతి అలా ఉంచితే వంశీని ఏకంగా 137 రోజుల పాటు విజయవాడ సబ్ జైలులో ఉంచారు. ఆయన ఫిబ్రవరి 16న హైదరాబాద్ లో అరెస్ట్ అయితే జూలై 2న రిలీజ్ అయ్యారు.
By: Tupaki Desk | 2 July 2025 10:47 PM ISTవల్లభనేని వంశీ అందగాడుగా జైలుకు వెళ్లారు. వయసు మీద పడిన వృద్ధుడిగా బయటకు వచ్చారు. వంశీ తమకంటే అందగాడు కాబట్టి అసూయతో ఆయన మీద చంద్రబాబు లోకేష్ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అని వంశీని విజయవాడ సబ్ జైలులో పరామర్శించిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ అన్న మాటలు. వంశీ ఏ తప్పూ చేయెలేదని కమ్మ వారిలో తామే అంతా కనిపించాలని మరో నేత ఎదిగి రాకూడదు అన్న ఆలోచన వల్లనే ఇలా టార్గెట్ చేస్తున్నారు అని జగన్ అన్నారు.
వీటి సంగతి అలా ఉంచితే వంశీని ఏకంగా 137 రోజుల పాటు విజయవాడ సబ్ జైలులో ఉంచారు. ఆయన ఫిబ్రవరి 16న హైదరాబాద్ లో అరెస్ట్ అయితే జూలై 2న రిలీజ్ అయ్యారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో అలా ఆయన బయటకు వచ్చారు.
ఇక వంశీని కలిసేందుకు జైలు బయట ఆయన అభిమానులతో పాటు వైసీపీ నేతలు చాలా మంది ఉన్నారు అయితే వంశీ తన భార్య పంకజాక్షితో కలసి కారులో వెళ్ళిపోయారు. అభిమానులకు అభివాదం చేసుకుంటూ మౌనంగా ఆయన కారులో వెళ్ళిపోవడం పట్ల చర్చ సాగుతోంది.
వంశీకి బెయిల్ వచ్చింది కానీ కేసుల గురించి ఎక్కడా మాట్లాడకూడని షరతులు ఉన్నాయేమో అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఇప్పటికే అనేక కేసులను ఆయన ఎదుర్కొన్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో కేసు పడేది. అలా పీటీ వారెంట్లతో ఆయన జైలులోనే మగ్గిపోవాల్సి వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే జైలుకు వెళ్ళే ముందు వంశీ వేరు వచ్చిన తరువాత వంశీ వేరు అన్న మాట వినిపిస్తోంది. వంశీ రూపమే కాదు ఆయన ఆలోచనలో కూడా బాగానే మార్పులు వచ్చి ఉంటాయని అంటున్నారు. రెడ్ బుక్ లో ఆయనే మొదటి పేజీలో మొదటి పేరుగా ఉన్నారు. దాంతో ఆయన మీద ఎంతలా కార్నర్ చేస్తారు అన్నది అర్ధం అయింది అని అంటున్నారు.
దాంతో ఆయన బెయిల్ మీద ఉన్నా కూడా ఇక మీదట క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటారా అన్న చర్చ సాగుతోంది. నిజానికి చూస్తే గత ఏడాది వంశీ గన్నవరం అసెంబ్లీ సీటులో ఓటమి చెందిన తరువాత గన్నవరానికి వచ్చినది కూడా పెద్దగా లేదని అంటున్నారు.
ఇక ఆయన అరెస్టు అయ్యాక దాదాపుగా నాలుగు నెలలకు పైగా జైలు జీవితం అనుభవించారు ఇపుడు బెయిల్ మీద ఉన్నారు. దాంతో ఆయన రాజకీయంగా ఏ విధంగా వ్యవహరిస్తారు అన్న డిస్కషన్ సాగుతోంది ఇక ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉన్నాయని అంటున్నారు. దాంతో ప్రశాంతమైన జీవితాన్ని ఆయన కోరుకుంటారా లేక 2029 దాకా వెయిట్ ఎన్నికల ముందు తన కొత్త రాజకీయాన్ని చూపిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి వంశీ రాజకీయం దారి ఏమిటో. ఏది ఏమైనా వంశీ మాత్రం బాగా నలిగిపోయారు అన్నదే ఆయన ముఖం చూసే అందరికీ అర్ధం అవుతోంది అని అంటున్నారు.
