వంశీ అరాచకాలపై టీడీపీ మీడియా వేట.. ఏ విధంగా క్షమించరాదన్నట్లు కథనాలు!
ఆరు కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న వంశీపై తాజాగా గన్నవరం నియోజకవర్గానికి చెందిన రెండు కేసులులో అరెస్టు చేశారు.
By: Tupaki Desk | 17 May 2025 8:59 PM ISTఏపీ రాజకీయం మంచి కాకమీద కొనసాగుతోంది. ఎన్నికలు జరిగి ఏడాదైనా ఇంకా రాజకీయ వేడి మాత్రం చల్లారడం లేదు. ముఖ్యంగా వైసీపీ నేతల అరెస్టులు, కేసులతో రాజకీయం వాడివేడిగానే కొనసాగుతోంది. అయితే అన్నికేసులు ఒక లెక్క అయితే.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఓ లెక్కగా చూస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంతోపాటు టీడీపీ మీడియాలో వంశీకి వ్యతిరేకంగా జరుగుతున్న వస్తున్న కథనాలు, జరుగుతున్న పరిణామాలతో వంశీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే పరిస్థితి లేదన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు వంద రోజులుగా జైలులో ఉన్న వంశీ ఆరోగ్యం బాగోలేకపోయినా ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. ఆయనపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్కో కేసులో బెయిలు వస్తుండగా, మరో కేసు నమోదు చేస్తూ ‘ఇంకా చాలా ఉంది’ అన్న సంకేతాలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత ఫిబ్రవరిలో అరెస్టు అయిన మాజీ ఎమ్మెల్యే వంశీపై మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు కేసులో రెండు రోజుల క్రితమే తెరపైకి వచ్చాయి. ఆ రెండింటిని ఇన్నాళ్లు గుట్టుగా ఉంచిన ప్రభుత్వం.. వంశీపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ పై బయటకి వస్తారన్న సమయంలో బయటపెట్టింది. దీంతో ఆయన మళ్లీ కొన్నాళ్లు జైలులోనే గడపాల్సిన పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ప్రధానంగా కొందరు వంశీ పరిస్థితిపై జాలి చూపుతున్నా, ఆ పార్టీ అనుకూల మీడియా మాత్రం క్షమించడం లేదు. వంశీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. దీంతో వంశీ అనుచరులు తమ నేత విడుదలపై భీతిల్లుతున్నారు.
ఆరు కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న వంశీపై తాజాగా గన్నవరం నియోజకవర్గానికి చెందిన రెండు కేసులులో అరెస్టు చేశారు. ఇందులో ఒకటి బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు కాగా, మరొకటి గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగుకు సంబంధించినది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కేసు వంశీ టీడీపీలో ఉండగా నమోదైంది. కానీ, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోలేదు. అయితే ఆ కేసుకు ప్రధాన కారణమైన ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు పట్టుబట్టడంతో తాజాగా ఆ కేసు బూజు దులిపి పిటీ వారంటు దాఖలు చేశారని అంటున్నారు. ఈ కేసులో 14 రోజుల రిమాండు పడటంతో వంశీ మళ్లీ జైలుకు వెళ్లాల్సివచ్చింది. ఇన్నాళ్లు విజయవాడ జైలు, అక్కడి కోర్టులోనే గడిపిన వంశీ.. శుక్రవారం బాపులపాడు కేసు విషయమై తన నియోజకవర్గమైన హనుమాన్ జంక్షన్ పోలీసుస్టేషన్ కు వెళ్లాల్సివచ్చింది. ఆ తర్వాత పక్కనే ఉన్న నూజివీడు కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో వంశీ అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయన ధీన స్థితిని చూసి కన్నీరు పెట్టారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇక బాపులపాడు కేసు అలా ఉండగానే, గన్నవరంలో మైనింగ్ పై గనుల శాఖ అధికారుల ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉండగా, వంశీ అండ్ బ్యాచ్ కొండలు గుట్టలు తవ్వేశారని, దాదాపు రూ.100 కోట్లకు పైనే అక్రమాలు జరిగాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదును బలపరిచేలా ఈనాడు పత్రికలో ప్రచురితమైన కథనం సంచలనంగా మారింది. ‘‘అతడో విధ్వంసం.. అడిగితే అరాచకం’’ అంటూ రాసిన కథనం చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్లు అధికారం అండతో కన్నుమిన్ను కానకుండా అక్రమాలకు తెగబడ్డారని ఒక కథనంలో వంశీపై ఆరోపణలు చేశారు.
అధికారం అండతో వంశీ అనుచరులు గన్నవరం నియోజకవర్గంలో రెచ్చిపోయారంటూ వచ్చిన కథనం, గతంలో చోటుచేసుకున్న పరిణామాలన్నీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలియజేస్తోందని అంటున్నారు. ప్రక్రుతి వనరులు దోచుకుని రూ.కోట్లు దండుకున్నారని వంశీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గన్నవరం మండలం వెదురుపావులూరు, కొండపావులూరు, గోపవరకుగూడెం గ్రామాల్లో దాదాపు 300 ఎకరాల్లో కొండను తవ్వేశారని, అక్రమంగా బాంబులు వినియోగించారని ఆ కథనంలో పేర్కొన్నారు. అదేవిధంగా 500 ఎకారాల్లో సూరపల్లి తోకతిప్పలను తవ్వేశారని ఆరోపించారు. ప్రభుత్వ అనుకూల మీడియాగా భావించే ఈనాడులో వంశీపై ప్రత్యేక కథనాలు వస్తుండటంతో ఆయనపై కేసులను పకడ్బందీగా నమోదు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి ఇటు ప్రభుత్వం, అటు మీడియాతో ఒకేసారి యుద్ధం చేసి నెగ్గుకురావాల్సిన పరిస్థితిలో వంశీ ఎలా బయటపడతారనేది ఆసక్తి రేపుతోంది.
