కేంద్ర మంత్రిగా బాలశౌరి ?
గతంలో కాంగ్రెస్ లో పనిచేసినపుడు వైసీపీలో ఉన్నపుడు కూడా బాలశౌరి అనేక పార్లమెంటరీ కమిటీలలో పనిచేశారు.
By: Satya P | 11 Jun 2026 9:13 AM ISTసీనియర్ మోస్ట్ లీడర్ వల్లభనేని బాలశౌరికి ఎట్టకేలకు రాజకీయ దశ తిరగనుంది అని అంటున్నారు. ఆయన ఇప్పటికి పాతికేళ్ళ క్రితం తొలిసారి ఎంపీగా గెలిచారు ఆయన 2004 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక 2013లో ఆయన వైసీపీలో చేరి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అయిత 2019లో వైసీపీ అభ్యర్థిగా మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో అదే మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా గెలుపొందారు. ఇలా మూడు పార్టీల నుంచి మూడు సార్లు గెలిచిన చరిత్ర ఆయనకు ఉంది.
జనసేన తరఫున :
తొందరలో జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో జనసేన తరఫున ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఖాయం అయింది అని ఢిల్లీ వర్గాల సమాచారంగా ఉంది. జనసేనకు లోక్ సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరి మచిలీపట్నం నుంచి బాలశౌరి అయితే రెండవ వారు కాకినాడ నుంచి గెలిచిన ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్. ఇక రాజ్యసభకు జనసేన తరఫున లింగమనేని రమేష్ తొలిసారి గెలిచారు. ఈ ముగ్గురిలో చూస్తే మూడు సార్లు గెలిచిన బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి దక్కే చాన్స్ ఉందని అంటున్నారు.
పార్లమెంటరీ కమిటీల్లో :
గతంలో కాంగ్రెస్ లో పనిచేసినపుడు వైసీపీలో ఉన్నపుడు కూడా బాలశౌరి అనేక పార్లమెంటరీ కమిటీలలో పనిచేశారు. ఆయనకు ఈ రకమైన అనుభవం కూడా కేంద్ర మంత్రి పదవికి చాయిస్ గా కనిపిస్తోంది. జనసేనకు 2024 ఎన్నికల తరువాత మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడే కేబినెట్ లో చాన్స్ వచ్చింది. ఆనాడు జనసేన ఎందుకో ఆసక్తి చూపించలేదని అంటారు. ఈసారి మాత్రం జనసేన వాటా కింద ఈ పదవి తీసుకుంటారు అని అంటున్నారు. దాంతో గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తే ఉమ్మడి క్రిష్ణా జిల్లా నుంచి బాలశౌరి ప్రాతినిధ్యం వహించబోతారు అని అంటున్నారు.
పెమ్మసానికి ప్రమోషన్ :
గత రెండేళ్ళుగా తనకు కేటాయించిన శాఖలలో మంచి పనితీరు కనబరచిన పెమ్మసానికి కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ప్రమోషన్ దక్కుతుందని అంటున్నారు. ఆయనకు ఇండిపెండెంట్ చార్జి తో కూడిన మంత్రిత్వ శాఖ ఇస్తారని తెలుస్తోంది. ఇక బాలశౌరి మూడు సార్లు గెలిచి వచ్చారు కాబట్టి నేరుగా కేంద్ర కేబినెట్ మంత్రిగా తీసుకుంటారా లేక ఇండిపెండెంట్ చార్జి తో ఇస్తారా లేక సహాయ మంత్రిగా తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. కేబినెట్ బెర్త్ ఇస్తే కనుక ఏపీ నుంచి ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు అవుతారు అని అంటున్నారు. అదే విధంగా ఒక ఇండిపెండెంట్ చార్జితో పాటు బీజేపీకి చెందిన ఒక సహాయ మంత్రిని కొనసాగిస్తూనే అలాగే టీడీపీకి చెందిన సహాయ మంత్రి మరొకరిని కొత్తగా తీసుకునే చాన్స్ ఉందని అంటున్నారు. దాంతో ఈసారి విస్తరణలో ఏపీకి పెద్ద పీట దక్కుతుందని కూడా ప్రచారం అయితే సాగుతోంది.
