Begin typing your search above and press return to search.

వడ్డేపల్లి లో ఫార్వర్డ్ బ్లాక్ - జాగృతి కవితకు షాక్

తెలంగాణలో తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అనేక రాజకీయ చిత్రాలు చోటు చేసుకున్నాయి.

By:  Satya P   |   13 Feb 2026 11:05 PM IST
వడ్డేపల్లి లో  ఫార్వర్డ్ బ్లాక్ - జాగృతి కవితకు షాక్
X

తెలంగాణలో తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో అనేక రాజకీయ చిత్రాలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి వడ్డేపల్లి మునిసిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఘన విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ ని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ని బీజేపీని కాదని ఫార్వర్డ్ బ్లాక్ కి ఓటర్లు పట్టం కట్టారు. అయితే తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ తనయ అయిన కల్వకుంట్ల కవితకు తమ విజయానికి ఏ సంబంధం లేదని ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆ విధంగా కవితకు ఆయన భారీ షాక్ ఇచ్చారు.

తమ గుర్తు పైనే విజయం :

ఒక టీవీ చానల్ తో ఆయన మాట్లాడుతూ వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో తన విజయానికి కల్వకుంట్ల కవితకు ఎటువంటి సంబంధం లేదని తేల్చేశారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు పైన తాము గెలిచామని అన్నారు. ఇక తన విజయం పూర్తిగా తనదేనని ఆయన స్పష్టం చేశారు. తనది నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం అన్నారు. తన రెక్కల కష్టం మీదనే విజయం సాధించాం తప్ప ఎవరి పాత్ర ఇందులో లేదని ఆయన అన్నారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల తర్వాత కవితతో తనకు ఎటువంటి అధికారిక సంబంధం లేదని శ్రీనివాస్ ఖండించడం విశేషం.

రాజకీయ ప్రకంపనలు :

ఇదిలా ఉంటే తెలంగాణా రాజకీయాల్లో పార్టీ పెట్టకుండానే కవిత రాజకీయ ప్రకంపనలు రేపారు అని తొలి వార్తలు పేర్కొన్నాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీ తెలంగాణా జాగృతి మద్దతుదారులు అంతా కలసి గెలిచారు అని కవిత ఖాతాలో ఈ విజయాన్ని వేయడం విశేషం. ఆ విధంగా టీవీలలో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన తరువాత ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ ఈ ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ఖండించడం గమనార్హం. ఆమె తమ పార్టీ తరఫున ఎటువంటి ప్రచారం కూడా చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తమ ప్రచారంలో కూడా ఎక్కడా తెలంగాణా జాగృతి కండువా కానీ జెండా కానీ ప్రదర్శించలేదని అన్నారు.

జనాలు ఆదరించారు :

దీంతో కవిత వర్గంగా గుర్తింపు పడిన వారు వడ్డేపల్లి మునిసిపాలిటీని గెలిచారు అని తొలుత వచ్చిన ప్రచారం శ్రీనివాస్ వివరణతో ఆగిపోయింది. మరి కవిత ఈ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అయితే కవిత మద్దతుదారులు కొందరు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేశారు అని జాగృతి తరఫున చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఏ విధంగా ముందుకు సాగుతుందో. ఈ విజయం వెనక కారణాలు ఏమిటో. వడ్డేపల్లి శ్రీనివాస్ అయితే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని జనాలు ఆదరించారు అని వారికే తాను కృతజ్ఞతలు తెలియచేస్తాను అంటున్నారు. రానున్న కాలంలో సొంతంగా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున రాజకీయాలు చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.