Begin typing your search above and press return to search.

ఇస్లాంలో డ్రెస్ కోడ్ లేదు.. ఏమిటీ ఉజ్జెకిస్తాన్ మోడల్?

అయితే.. ఈ స్వేచ్ఛ అంతకంతకూ ఎక్కువైపోవటం ఒక ఎత్తు అయితే.. సనాతన ధర్మం మీద అభిమానం.. అనురక్తి ఎక్కువ కావటం మరో ఎత్తు

By:  Tupaki Desk   |   19 Sep 2023 5:30 PM GMT
ఇస్లాంలో డ్రెస్ కోడ్ లేదు.. ఏమిటీ ఉజ్జెకిస్తాన్ మోడల్?
X

రోజులు గడుస్తున్నకొద్దీ ఛాదస్తం పెరిగిపోతున్న వైనం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఉదారవాదానికి నిలువెత్తు రూపంగా.. తనను తాను మార్చుకోవటానికి.. తన తప్పుల్ని సరి చేసుకోవటానికి హిందూమతంలో మార్పులు తరచూ చోటు చేసుకుంటుంటాయి. అయితే.. ఈ స్వేచ్ఛ అంతకంతకూ ఎక్కువైపోవటం ఒక ఎత్తు అయితే.. సనాతన ధర్మం మీద అభిమానం.. అనురక్తి ఎక్కువ కావటం మరో ఎత్తు. ఏదైనా సరే.. మోతాదు దాటితే ఇబ్బందే. ఇప్పుడు అలాంటి పరిస్థితే హిందూమతానికి సంబంధించి జరుగుతుున్న చర్చల్లో తరచూ వినిపిస్తోంది.

కొందరు అపరిమితమైన స్వేచ్ఛను తీసుకుంటుంటే.. మరి కొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారే తప్పించి.. మధ్యే మార్గాన్ని సూచిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. దీంతో.. విభజన రేఖకొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. హిందూమతంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇస్లాంకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మారే కాలానికి అనుగుణంగా మారేందకు కుదరదని చెప్పే వారికి భిన్నంగా.. ఒకప్పటి సోవియెట్ యూనియన్ లో భాగంగా ఉన్న ఉజ్జెకిస్తాన్ ఇప్పుడు సరికొత్త చర్చగా మారింది. దీనికి కారణం.. ఆ దేశంలోని ముస్లిం మత పెద్దల నుంచి ప్రభుత్వం వరకు అనుసరిస్తున్న విధానాలే.

తాజాగా ఆ దేశ గ్రాండ్ ముఫ్తీ నురుద్దీన్ ఖలిక్న జరోవ్ చేసిన ప్రకటన ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఇస్లాంలో కఠినమైన డ్రెస్ కోడ్ అనేది ఏదీ లేదని ఆయన చెబుతున్నారు. ''మతపరమైన వస్త్రధారణకు సంబంధించి మనం చాలా దూరం వెళ్లాం. ఇస్లాం కొన్ని నిర్దేశిత దుస్తుల్ని.. కొన్ని పద్దతుల్లోనే వస్త్రధారణ ఉండాలని కోరినట్లుగా అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి.. ప్రొఫెట్ ఆ నిర్ణయాన్ని మనకే వదిలేశారు. ఇస్లాం కచ్ఛితంగా ఇలాంటి పద్దతిలోనే ఉండాలని చెప్పలేదు'' అని పేర్కొన్నారు. అంటే.. హిజాబ్ కు మిగిలిన డ్రెస్సులకు తేడా లేదని చెప్పటమే ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు.

ఒక పద్దతిలోనే వస్త్రధారణ అసాధ్యమని.. ఎందుకంటే ఇస్లాం అన్నది ఒక దేశానికి..ఒక కాలానికి సంబంధించిన మతం కాదన్నది ఆయన వ్యాఖ్య. ఈ సందర్భంగా ఆయన మొహమ్మద్ ప్రవక్త మాటల్ని ఆయన ఉటంకిస్తూ.. ''ఆ అల్లా నీ అలంకరణ.. నీ సందనను చూడడు. ఇస్లాం అన్నది సమస్త మానవాళి కోసం పంపినది. ముస్లింగా.. ఉజ్బెక్ గా ఉండాలన్నది దేశంలోని మెజార్టీ ప్రజల ఆలోచన'' అంటూ ఆయన చెబుతున్నారు. ఈ దేశం గురించి.. ఇక్కడి వారి గురించి తెలిసిన వారు ఆసక్తికర అంశాల్ని చెబుతుంటారు. ఈ దేశంలోని ఇస్లాంకు.. మిగిలిన దేశాల్లోని ఇస్లాం చాలా భిన్నమన్న అభిప్రాయం ఉంది. ఇక్కడి ఇస్లాం సున్నితమైనదని.. ఉదారమైనదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

సోవియెట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత ఉజ్బెకిస్తాన్ ఒక స్వతంత్ర్య రిపబ్లిక్ గా అవతరించిన విషయం తెలిసిందే. అయితే.. ఇక్కడో ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించాలి. సోవియెట్ యూనియన్ లో కలిసి ఉండటం ఒక విధమైన వరంగా.. మరో విధమైన శాపంగా చెబుతుంటారు. ఎందుకంటే.. కమ్యునిజం మతాన్ని మరుగున పడేసే ప్రయత్నం చేసింది. కానీ.. ఈ దేశ ప్రజల గుండెల్లో నుంచి మతాన్ని సమూలంగా రూపుమాపలేకపోయినట్లుగా చెబుతారు.

35.5 మిలియన్ల జనాభాతో ఉన్న ఈ దేశంలో అత్యధికులు ముస్లింలే. సోవియెట్ నుంచి విడిపోయి.. స్వతంత్ర్య దేశంగా ఏర్పడిన సమయంలో ఈ దేశాన్ని కొన్ని మతశక్తులు జొరబడి.. మార్చే ప్రయత్నం చేశారు. అఫ్గాన్ తో సరిహద్దులు పంచుకునే ఈ దేశం.. ఉగ్ర పడగనీడ పడకుండా పాలకులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కఠినంగా వ్యవహరించారు. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా.. ఇక్కడి పాలకులు మాత్రం వెనుకడుగు వేయలేదని చెబుతారు. అదే.. ఆ దేశాన్ని ఇప్పుడు ప్రశాంతంగా ఉంచేందుకు సాయం చేసిందన్న అభిప్రాయం ఉంది. ఉదారవాదనలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ దేశంలోని మత పెద్దల మాటలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతున్నాయి.