Begin typing your search above and press return to search.

వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఇకపై ఆ స్టిక్కర్లు ఉంటే భారీ జరిమానా!

వాహనాలపై కులాలు, మతాలకు సంబంధించిన స్టిక్కర్లు వేసుకునే వారికి యూపీ సర్కారు చలానాలు వడ్డింపు మొదలుపెట్టింది

By:  Tupaki Desk   |   25 Aug 2023 11:33 AM GMT
వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఇకపై ఆ స్టిక్కర్లు ఉంటే భారీ జరిమానా!
X

చాలా మంది ఏదైనా వాహనం కొంటే.. వెంటనే దాన్ని స్టిక్కరింగ్ షాప్ కి తీసుకెళ్లి క్యాస్ట్ పేరు రాయించడమో.. దేవుడి ఫోటోలు అంటించేయడమో చేస్తుంటారు! ఈ విషయంలో తాను నమ్మే దేవుడి ఫోటొలకంటే ఎక్కువగా... వాహనం వెనుక కులం పేరు బోల్డ్ లెటర్స్ తో రాసుకుంటుంటారు.

అయితే ఇలాంటి పనులకు పాల్పడితే భారీ జరిమానా అంటూ కొత్త రూల్స్ తెరపైకి వచ్చాయి. ఇకపై ఎవరైనా... కారు, బైక్, మరే ఇతర వాహనం పై అయినా కులాలను గుర్తు చేసేలా, మతాలను ప్రతిబింబించేలా స్టిక్కర్లు, స్టిక్కరింగులూ చేయితే వాయింపే. ఆ వివరాలేమిటో మీరే చూడండి!

వాహనం ఏదైనా రోడ్డు మీదకు వస్తే ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాల్సిందే. ఇందులో భాగంగా సాధారణంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, ఆర్‌సీ, పొల్యూషన్ వంటివి లేకపోతే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తుంటారు. సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్ లో వెళ్లినా ఫైన్ వేస్తుంటారు. అయితే ఇప్పుడు క్యాస్ట్ స్టిక్కర్ ఉన్నా కూడా వాయింపే!

వాహనాలపై కులాలు, మతాలకు సంబంధించిన స్టిక్కర్లు వేసుకునే వారికి యూపీ సర్కారు చలానాలు వడ్డింపు మొదలుపెట్టింది. ఖరీదైన కార్లు మొదలు స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ వెహికిల్స్ వేటినీ వదలకుండా ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్లు వేయడం మొదలుపెట్టేశారు.

అవును... ఇప్పటికే "బుల్డోజర్ల"తో రౌడీ షీటర్లు, నేరస్థుల ఇళ్లను ధ్వంసం చేస్తున్న యోగి సర్కారు చూపు.. ఇప్పుడు వాహనాల స్టిక్కర్లపై పడింది. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలపై కులాల పేర్లు కనిపించేలా స్టిక్కర్లు వేసుకునే వారికి పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది.

వాహనాలపై ఉండే క్యాస్ట్ స్టిక్కర్లు లేదా కులాలను గుర్తు చేసేలా ఏవైనా మెసేజ్‌ లు ఉండటం వల్ల డ్రైవర్లు, రైడర్ల దృష్టిని మళ్లిస్తుందని.. ఫలితంగా ఇది రోడ్డు ప్రమాదాలకు దారి తీయొచ్చని యూపీ పోలీసులు చెబుతున్నారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179 (1) కింద దీన్ని నేరంగా పరిగణిస్తారు. ఇందులో భాగంగా 2,300 కార్లకు ఇప్పటికే చలాన్లు విధించారు.

పెనాల్టీల వివరాలు:

కుల, మతాలను సూచించే ఏ విధమైన స్టిక్కర్‌ ని అయిన ప్రదర్శించడం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమేనని నోయిడాలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సూచనల మేరకు చట్టం అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

ఇందులో భాగంగా... కులం లేదా మతాన్ని సూచించే పదాలు లేదా స్టిక్కర్లను తమ వాహనాలపై ప్రదర్శిస్తే.. వాహనాలకు రూ.1,000 జరిమానా, నంబర్ ప్లేట్‌ పై ఆ స్టిక్కర్లు కనిపిస్తే రూ.5,000 వరకు జరిమానా పడే అవకాశం ఉందని సమాచారం.

కాగా... "ఈ రూల్ తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తే.." అంటూ ఈ నిబంధనపై ఆన్ లైన్ వేదికగా తమదైన శైలిలో స్పందిస్తున్నారు నెటిజన్లు!