Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రాలో బస్తీమే సవాల్...!

ఉత్తరాంధ్రా జిల్లాలలో రాజకీయ పోరుకు ప్రధాన పార్టీలు సిద్ధపడుతున్నాయి. ఉత్తరాంధ్రా మాదంటే మాది అని అంటున్నాయి.

By:  Tupaki Desk   |   12 Feb 2024 4:01 AM GMT
ఉత్తరాంధ్రాలో బస్తీమే సవాల్...!
X

ఉత్తరాంధ్రా జిల్లాలలో రాజకీయ పోరుకు ప్రధాన పార్టీలు సిద్ధపడుతున్నాయి. ఉత్తరాంధ్రా మాదంటే మాది అని అంటున్నాయి. అధికార వైసీపీ ఎటూ ఉత్తరాంధ్రానే నమ్ముకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత నెల చివరిలో నిర్వహించిన సిద్ధం సభ ఉత్తరాంధ్రా నుంచే కావడం విశేషం.

చంద్రబాబు రా కదలిరా అంటూ ఇటీవల ఉత్తరాంధ్రా జిల్లాలో పర్యటించారు. జనసేన కూడా ఇటు వైపే చూస్తోంది. జనసేన కీలక నాయకుడు నాగబాబు గత నాలుగైదు రోజులుగా విశాఖ జిల్లాలో పర్యటించి పార్టీ సమీక్షలు నిర్వహించారు. సభలు సమావేశాలు నిర్వహించారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన వైఎస్ షర్మిల ఇచ్చాపురం నుంచే తన రాజకీయాన్ని మొదలెట్టారు. ఆమె తొలి విడతలో మూడు ఉమ్మడి జిల్లాలలో తిరిగి కాంగ్రెస్ లో కదలిక తీసుకుని వచ్చారు. ఇక తాజాగా మరోసారి ఏజెన్సీ జిల్లా పాడేరు, నర్శీపట్నం లో పర్యటించారు. రచ్చబండ కార్యక్రమాలని నిర్వహించారు.

ఇపుడు లోకేష్ వంతు అన్నట్లుగా ఉంది. శంఖారావం పేరుతో లోకేష్ ఇచ్చాపురం నుంచి తన సభలను నిర్వహిస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్రాలోని మొత్తం ఉమ్మడి మూడు జిల్లాలలో పదుల సంఖ్యలో సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది.

ఇలా అంతా ఉత్తరాంధ్ర మీదనే పడుతున్నారు. ఎందుకు ఇలా అంటే ఈ జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అంటే ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఇవి అయిదవ వంతు అన్న మాట. శాసనసభ సీట్ల సంఖ్యలో ఇరవై శాతం సీట్లు ఇక్కడే ఉన్నాయి. అధికారాన్ని అందుకునేందుకు అవసరం అయిన 88 సీట్లలో నలభై శాతం సీట్లు ఇక్కడ ఉన్నాయి.

ఎలా చూసుకున్నా ఉత్తరాంధ్రా సీట్లు ఇపుడు అన్ని రాజకీయ పార్టీలకూ కావాలి. పైగా ఇక్కడ జనాలు ఎపుడూ వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఏకపక్షంగా తీర్పు ఇస్తారు. 2004 నుంచి చూస్తే ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. రెండు సార్లు కాంగ్రెస్ కి మెజారిటీ సీట్లు కట్టబెట్టి ఉమ్మడి ఏపీలో అధికారంలోకి రావడానికి కారణం అయిన ఉత్తరాంధ్రా 2014లో టీడీపీ కూటమికి 25 సీట్లు కట్టబెట్టి చంద్రబాబుని సీఎం గా చేసింది. 2019 నాటికి వస్తే వైసీపీకి 34 సీట్లలో ఏకంగా 28 సీట్లు ఇచ్చింది. జగన్ కి అలా 151 సీట్లు దక్కాయి.

దాంతో ఇపుడు ప్రధాన పార్టీల కన్ను ఉత్తరాంధ్రా మీద పడింది. మరోసారి ఏకపక్ష విజయం అందుకోవాలని వైసీపీ ఆరాటపడుతోంది. టీడీపీ కంచుకోటలను బద్ధలుకొట్టేశామని ఇక తమదే విజయం అని వైసీపీ అంచనా వేసుకుంటోంది. అయితే జనసేనతో కలసి వస్తున్న టీడీపీకి ఈసారి రాజకీయ జాతకం మారవచ్చు అని అంటున్నారు. దాంతో 2014 మాదిరిగానే అత్యధిక సీట్లలో కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటులో ఉత్తరాంధ్ర తమకు సహకరిస్తుందని టీడీపీ నమ్ముతోంది.

అందుకే నారా లోకేష్ శంఖారావం సభలో ఉత్తరాంధ్రా జిల్లాలు టీడీపీకి కంచుకోటలు అని గట్టిగా చెప్పుకున్నారు. జనసేన నాయకుడు నాగబాబు అయితే ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపీకి ఒక్క సీటు కూడా రానీయకుండా టీడీపీ జనసేన కూటమి కలసి పనిచేయాలని కోరారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రాలో ప్రధాన పార్టీలు బస్తీ మే సవాల్ అని దూసుకుని వస్తున్నాయి. జనం తీర్పు ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా ఉంది.