భారత రైతుల షాకింగ్ డెసిషన్.. 'రాణి పాన్' కోసం పాక్ ఎదురుచూపులు!
ఉత్తర కర్ణాటకలోని హోన్నవర్ ప్రాంత శరావతి నది పరివాహక ప్రాంతంలో పండించే ప్రత్యేకమైన పాన్ ఆకులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.
By: Tupaki Desk | 17 May 2025 3:00 AM ISTపాకిస్తాన్ మద్దతుతో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్‌తో దీటుగా బదులిచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారత్ ప్రభుత్వం పాకిస్థాన్‌తో అనేక వాణిజ్య ఒప్పందాలను కూడా నిలిపేసింది. పాకిస్థాన్, దాని మద్దతుదారుల నుండి దిగుమతులు, ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఉత్తర కన్నడ జిల్లా రైతులు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము పాకిస్థాన్‌కు తమ ప్రాంతీయ పాన్ ఆకులను ఎగుమతి చేయడానికి అంగీకరించబోమని వారు తేల్చి చెప్పారు.
ఉత్తర కర్ణాటకలోని హోన్నవర్ ప్రాంత శరావతి నది పరివాహక ప్రాంతంలో పండించే ప్రత్యేకమైన పాన్ ఆకులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గత కొన్ని తరాలుగా ఢిల్లీలోని వ్యాపారులు ఈ ఆకులను కొనుగోలు చేసి పాకిస్థాన్‌కు ఎగుమతి చేసేవారు. పాకిస్థాన్‌లో హోన్నవర్ పాన్ ఆకులకు భారీ డిమాండ్ ఉండేది. అయితే, కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కు వెళ్లే భారతీయ వస్తువులపై నిషేధం విధించడంతో ఈ ఎగుమతులు నిలిచిపోయాయి.
అక్రమంగా పాకిస్థాన్‌కు చేరుతున్న పాన్ ఆకులు
వాస్తవానికి ఉత్తర కన్నడ పాన్ ఆకులు అక్రమ మార్గాల ద్వారా పాకిస్థాన్‌కు చేరుకుంటున్నాయి. హోన్నవర్ నుంచి ఢిల్లీకి సరఫరా చేయబడే పాన్ ఆకులు, అక్కడి నుంచి ఇతర మార్గాల ద్వారా పాకిస్థాన్‌కు తరలిపోతున్నాయి. ప్రతిరోజూ హోన్నవర్ నుంచి 11 టన్నుల కంటే ఎక్కువ పాన్ ఆకులు ఢిల్లీకి చేరుకునేవి. ఆపై వేరే దారుల ద్వారా పాకిస్థాన్‌కు చేరేవి. అయితే ఇప్పుడు హోన్నవర్ రైతులు ఈ విషయం తెలుసుకున్న తర్వా ఢిల్లీ వ్యాపారులకు పాన్ ఆకులు పంపడం నిలిపివేశారు. దీని ఫలితంగా పాకిస్థాన్‌కు వెళ్లే ఆకులు ఇప్పుడు దేశీయ మార్కెట్‌లో విక్రయించనున్నారు.
హొన్నవర్ రైతులు ఏమంటున్నారు?
"ధర పడిపోయినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నష్టం వచ్చినా భరిస్తాం. కానీ పాకిస్థాన్‌కు మాత్రం పాన్ ఆకులు సరఫరా చేయం. మేం దానికి అంగీకరించం" అని హోన్నవర్ రైతులు స్పష్టం చేశారు. జిల్లా రైతుల తరపున సతీష్ భట్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు పాన్ ఆకులు పంపడంపై శాశ్వత నిషేధం విధించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇతర మార్గాల ద్వారా పాకిస్థాన్‌కు పాన్ ఆకులు సరఫరా చేస్తే, తాము పాన్ ఆకులు పండించడం కూడా మానేస్తామని ఆయన హెచ్చరించారు.
