Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కాదు ఇప్పుడు వీఆర్ఎస్.. అదే కేసీఆర్ భయమట

అన్నింటికి మించి బీఆర్ఎస్ మీద ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారిన పేరు ఇప్పుడు వీఆర్ఎస్ గా మారిందన్నారు.

By:  Tupaki Desk   |   2 April 2024 4:14 AM GMT
బీఆర్ఎస్ కాదు ఇప్పుడు వీఆర్ఎస్.. అదే కేసీఆర్ భయమట
X

మొన్నటి వరకు తిరుగులేని అధికారం చేతిలో ఉండటమే కాదు.. గులాబీ బాస్ కేసీఆర్ ను ఢీ కొనే సత్తా ఉన్నోడే కనిపించని పరిస్థితి. అంతుకు భిన్నంగా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ముగిసిన ఎన్నికల వరకు కూడా మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో పవర్ ఫుల్ గా కనిపించేవారు. కానీ.. అధికారం చేజారిన తర్వాత ఆయన మాటలు.. చేతలు పేలవంగా ఉండటమే కాదు.. మరీ ఇంతలా తప్పులు చేయటమేంటి? అన్న ప్రశ్న వచ్చేలా ఆయన తీరు ఉంటోంది. పదేళ్లు అధికారంలో ఉన్న వేళలో ఏ రోజు ప్రజాసమస్యల మీద బయటకు వచ్చి.. కష్టంలో ఉన్న వారిని పలుకరించి.. వారి బాధల్ని విని.. వారికి ఊరడింపు మాటలు చెప్పిన పాపాన పోలేదు కేసీఆర్.

అలాంటి గులాబీ బాస్ ఇప్పుడు రైతులు కష్టాల్లో ఉన్నారని.. వారి వేతల్ని వినేందుకు వీలుగా తాజాగా పంట ఎండిపోయిన రైతులను కలవటంతో పాటు.. ఇటీవల భారీగా రైతులు మరణించారని వారి కుటుంబాల్ని పరామర్శించేందుకు వీలుగా రాజకీయ కార్యాచరణ షురూ చేయటం తెలిసిందే. ఇలాంటివేళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు.. పలువురు నేతలు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అన్నింటికి మించి బీఆర్ఎస్ మీద ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారిన పేరు ఇప్పుడు వీఆర్ఎస్ గా మారిందన్నారు. త్వరలోనే ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని గెలవలేదని చెప్పిన ఉత్తమ్.."ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగిలదన్న భయం కేసీఆర్ లో మొదలైంది. 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అది పచ్చి అబద్ధం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 200 మంది చేరుతున్నారు. ఆదివారం సూర్యాపేటలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమే. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు మినహా మరెవరూ నిలవరన్న ఆయన.. "సూర్యాపేటలో జనరేటర్ పెట్టుకొని సమావేశం పెట్టారు. సాంకేతిక సమస్య ఏర్పడితే కరెంట్ పోయిందని అబద్ధం చెప్పారు" అని మండిపడ్డారు.

కమీషన్ల కక్కుర్తి.. అనాలోచిత విధానాలతో రాష్ట్రంలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారన్న ఉత్తమ్.. కేసీఆర్ ప్రజకు క్షమాపణలు చెప్పాలన్నారు. గత అక్టోబరులో బీఆర్ఎస్ పాలనలోనే మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని సముద్రంలోకి వదిలేశారని.. ఇప్పుడు నీరు ఇవ్వటం లేదని ఆయన మాట్లాడటం పూర్తిగా సిగ్గుచేటుగా పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు క్రిష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని ఒప్పుకుంటే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పగించేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లుగా గుర్తు చేశారు. మొత్తంగా కేసీఆర్ వైఫల్యాల్ని తూర్పార పట్టిన ఉత్తమ్ మాటల్ని విన్నప్పుడు కేసీఆర్ లో భయం మొదలైందా? అన్న సందేహం కలుగక మానదు.