Begin typing your search above and press return to search.

పార్టీ అధిష్ఠానం అన్నది ఒకటి ఉండదా ఉత్తమ్?

ఎప్పుడెలా ఉండాలి? ఎప్పుడేం మాట్లాడాలన్న విషయం సీనియర్ రాజకీయ నాయకులకు తెలియంది కాదు

By:  Tupaki Desk   |   23 Aug 2023 5:52 AM GMT
పార్టీ అధిష్ఠానం అన్నది ఒకటి ఉండదా ఉత్తమ్?
X

ఎప్పుడెలా ఉండాలి? ఎప్పుడేం మాట్లాడాలన్న విషయం సీనియర్ రాజకీయ నాయకులకు తెలియంది కాదు. అయినప్పటికి.. కొన్నిసార్లు కట్టు తప్పి మాట్లాడే మాటలతో పార్టీకి నష్టం వాటిల్లేలా ఉంటాయన్న చిన్న విషయాన్ని మర్చిపోతుంటారు. తాజాగా మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఇలానే ఉంది. కీలకమైన ఎన్నికల వేళ.. తమ లాంటి నేతల నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు ఉండే ప్రభావాన్ని ఆయన మర్చిపోతున్నట్టున్నారు. ఎవరి టికెట్ అయినా సరే.. ఫైనల్ చేసేది అధిష్ఠానమే అన్న విషయాన్ని క్లియర్ గా సంకేతాలు ఇచ్చినప్పటికీ.. అందుకు భిన్నంగా ఉత్తమ్ నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి.

కోదాడలో తన భార్య.. హుజుర్ నగర్ లో తాను పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ రెండు నియోజకవర్గాల్లోని అధికారపార్టీ ఎమ్మెల్యేల దోపిడీ.. వికృత చేష్టలకు ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. వారిని ఇళ్లకు పంపటానికి సిద్దంగా ఉన్నారన్న ఉత్తమ్.. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఈసారి 70సీట్లు ఖాయమన్న ఉత్తమ్.. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూస్తే.. దోపిడీదారులను కేసీఆర్ వత్తాసు పలికినట్లుగా ఉందన్నారు.

మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. మారిన కాంగ్రెస్ అధినాయకత్వ తీరును ఉత్తమ్ సరిగా గుర్తించట్లేదా? అన్నదిప్పుడు చర్చగా మారింది. కొద్ది నెలల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నపరిణామాల్ని గుర్తు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరిగిన సిద్ధరామయ్య ఇంట్లోనే టికెట్ విషయంలో అధినాయకత్వం ఎంత పట్టుదలగా వ్యవహరించిందో తెలిసిందే.

అలాంటప్పుడు తమ కుటుంబానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని ఇలా ఓపెన్ గా మాట్లాడే కన్నా.. అధినాయకత్వానికి విన్నవించుకుంటే మంచిదన్న విషయాన్ని ఉత్తమ్ ఎందుకు మిస్ అవుతున్నారన్నది ప్రశ్న. ఇప్పటికే రెండు దఫాలు అధికారాన్ని మిస్ అయిన వేళ.. పార్టీవిజయం గురించి మాత్రమే ఆలోచించాలన్న కనీస ఆలోచన రాకపోవటం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో మారిన పార్టీ అధినాయకత్వపు మైండ్ సెట్ గురించి ఉత్తమ్ మర్చిపోయారా? అందుకు ఇలా మాట్లాడుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో మాదిరి.. పబ్లిక్ మీటింగ్ లోనో.. ప్రెస్ మీట్ పెట్టేసి విషయాన్ని చెప్పేసి.. అల్టిమేటం విధిస్తే.. ఆ వెంటనే స్పందించే తీరును కాంగ్రెస్ పార్టీ వదిలేసి చాలాకాలమే అయ్యింది. అలాంటప్పుడు ఒకే కుటుంబంలో రెండు టికెట్లు అన్న విషయంలో ఉత్తమ్ కోరుకున్నట్లుగా జరగాలనుకుంటే.. ఇలాంటి ప్రకటనలు చేయటం ఆపాలంటున్నారు. పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన ఉత్తమ్ కు అధిష్ఠానం ఎలా ఆలోచిస్తుందన్నది కూడా తెలీదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏమైనా.. ఉత్తమ్ మాటల్ని చూసి.. మరికొందరు మీడియా ముందుకు వచ్చి టికెట్ డిమాండ్ల మీద రచ్చ చేస్తే.. నష్టపోయేది పార్టీనే అన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు. మరి.. ఉత్తమ్ మాటలకు అధిష్ఠానం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.