Begin typing your search above and press return to search.

అధికార పక్షానికి చెమటలు పట్టించిన కర్ణాటక స్పీకర్

గడిచిన కొద్ది రోజులుగా చెబుతున్నప్పటికి పరిస్థితుల్లో మార్పు రాని నేపథ్యంలో తాజాగా తానేమిటో చూపించిన స్పీకర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Garuda Media   |   17 March 2026 11:37 AM IST
అధికార పక్షానికి చెమటలు పట్టించిన కర్ణాటక స్పీకర్
X

కర్ణాటక అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. స్పీకర్ పాత్ర అంతకంతకూ తీసికట్టుగా మారి.. అధికారపక్షానికి అనువుగా వ్యవహరించటమే తప్పించి.. స్వతంత్రంగా వ్యవహరించే తీరు కనిపించటం లేదన్న విమర్శకు చెక్ పెట్టేలా చేయటమే కాదు.. ఇలా కానీ స్పీకర్ వ్యవహరిస్తే.. అధికారపక్షం పరిస్థితి ఏమవుతుందన్న భావన కలిగే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఇందుకు కర్ణాటక విధాన సభ (అసెంబ్లీ) వేదికగా మారింది. గడిచిన కొద్ది రోజులుగా చెబుతున్నప్పటికి పరిస్థితుల్లో మార్పు రాని నేపథ్యంలో తాజాగా తానేమిటో చూపించిన స్పీకర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

స్పీకర్ ధర్మాగ్రహం అధికారపక్షానికి ముచ్చమటలు పట్టేలా చేస్తే.. స్పీకర్ తీరుపై విపక్షాలు ప్రశంసలతో ముంచెత్తిన పరిస్థితి. ఇంతకూ అసలేం జరిగిందంటే.. విధాన సభ ఎప్పుడు నిర్వహించినా సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం సాధ్యం కాదు.ఇది ఏ రాష్ట్రంలో అయినా ఉంటుంది. అందుకే.. సభ్యులు అడిగే ప్రశ్నల్లో కొన్నింటికి స్టార్ ప్రశ్నలుగా పరిగణించి.. మిగిలిన వాటికి రాతపూర్వకంగా బదులు ఇవ్వటం అన్నిచోట్ల జరిగేదే.

కర్ణాటకలో ప్రతి సమావేశాల్లోనూ ప్రత్యక్షంగా 30 ప్రశ్నలకు మంత్రుల నుంచి బదులు ఇప్పిస్తుంటే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా 15 ప్రశ్నలకు మాత్రమే పరిమితం చేశారు. రోజువారీగా దాదాపు 200లకు పైగా ప్రశ్నలను సభ్యులనుంచి స్వీకరించిన స్పీకర్ నేరుగా సంబంధిత శాఖ ద్వారా ఆయా మంత్రులకు, శాఖల కార్యదర్శులకు పంపటం తెలిసిందే. వాటికి జవాబులు తిరిగి వస్తుంటాయి.అయితే.. ఇటీవల కాలంలో అలా జవాబులు వచ్చే సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది.

ఈ అంశాన్ని విపక్ష సభ్యులు తరచూ స్పీకర్ వద్ద ప్రశ్నించటం.. దానికి ఆయన బదులివ్వటం గడిచిన కొంతకాలంగా జరుగుతోంది. గత శుక్రవారం 250కు పైగా ప్రశ్నలకు కేవలం 50 ప్రశ్నలకు మాత్రమే బదులు ఇవ్వటంపై స్పీకర్ స్పందిస్తూ.. తన మౌనాన్ని బలహీనతగా భావించొద్దంటూ సున్నిత హెచ్చరిక చేశారు. అయినా.. అధికారుల తీరులో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో సభ్యులు అడిగి అన్ని ప్రశ్నలకు బదులు ఇప్పించాలన్న ఆదేశాల అమలు జరగని వైనంపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.

సోమవారం ప్రశ్నోత్తరాలు పూర్తి కాగానే లికిత ప్రశ్నల జాబితాను హోం మంత్రి జి. పరమేశ్వర్ చదువుతూ ఈసారి 230 ప్రశ్నల్లో 84 ప్రశ్నలకు బదులు ఇప్పించామని.. పరిస్థితి కాస్త మెరుగుపడినట్లుగా పేర్కొన్నారు. దీనికి స్పందించిన విపక్ష నేత అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చనిపోయిందని.. తిథి చేసుకునే రోజు వచ్చిందంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు.. స్పీకర్ హెచ్చరికల్ని కూడా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా స్పందించిన స్పీకర్.. తాను సభను నిర్వహిస్తోంది.. మంత్రుల కోసం కాదని.. సభ్యుల కోసమన్నారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పించే అంశంపై మంత్రులు.. అధికారులు సమావేశమై సమస్యను పరిష్కరించే వరకు సభను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన వైనం అధికారపక్షానికి షాకింగ్ గా మారగా.. స్పీకర్ చర్య సంచలనమైంది.

తాను చెప్పాల్సింది చెప్పేసి.. స్పీకర్ ఛైర్ నుంచి లేచి వెళ్లిపోయారు. ఈ అనూహ్య పరిణామంతో అధికారపక్షం హైరానాకు గురైంది. మధ్యాహ్నం 12.30 గంటల వేళలో సభ వాయిదా వేయటంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. సీనియర్ మంతరులు.. విపక్ష నేతలంతా స్పీకర్ కార్యాలయానికి చేరుకొన్నారు. సమాధానాలు ఇవ్వని అధికారుల వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అక్కడికక్కడే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించాు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని.. సకాలంలో జవాబులు ఇప్పిస్తామని హామీఇవ్వటంతో స్పీకర్ సభకు వచ్చారు.

ప్రభుత్వం విఫలమైనా.. మంత్రులు.. అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నా.. సభ ఎప్పటికి ఫెయిల్ కాదన్నవిషయాన్ని స్పీకర్ నిరూపించారంటూ విపక్ష నేత అశోక్ అభినందించారు. సభను.. సభ్యుల గౌరవం.. హక్కులను రక్షించిన స్పీకర్ చర్య సభా రికార్డుల్లో చిరస్థాయిడా నిలిచిపోతారన్న ప్రశంసలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల స్పీకర్లుసైతం ఇదే రీతిలో కాస్తంత స్వతంత్రంగా వ్యవహరిస్తే ఎంత బాగుండన్న భావన కలిగేలా కర్ణాటక స్పీకర్ యు.టి.ఖాదర్ వ్యవహరించారని చెప్పక తప్పదు.