Begin typing your search above and press return to search.

యూఎస్ ఒపీనియన్ పోల్... బిడెన్ కు బ్యాడ్ న్యూస్ చెబుతున్నాయా?

తాజాగా ప్రచురించిన పరిశోధనలో జో బిడెన్ ఆమోదం రేటింగ్ పడిపోయిందని తెలుస్తుంది. బిడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇది అత్యల్ప రేటింగ్ అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 3:53 PM GMT
యూఎస్  ఒపీనియన్  పోల్... బిడెన్  కు బ్యాడ్  న్యూస్  చెబుతున్నాయా?
X

ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్యం 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... జో బిడెన్ కోటను పట్టుకోవాలని డెమోక్రాట్లు ఆశతో ఉండగా.. రిపబ్లికన్ అభ్యర్థులు పోటీ కోసం పోరాడుతున్నారు. ఈ మధ్యలో జో బిడెన్, డెమొక్రాట్‌ లకు ఆందోళన కలిగించే అంశం తెరపైకి వచ్చింది. దీంతో... బిడెన్ గోడలకు బీటలు వారుతున్నాయని.. ట్రంప్ కు మరో ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

అవును... ప్యూ రీసెర్చ్ తాజాగా ప్రచురించిన పరిశోధనలో జో బిడెన్ ఆమోదం రేటింగ్ పడిపోయిందని తెలుస్తుంది. బిడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇది అత్యల్ప రేటింగ్ అని అంటున్నారు. ఈ క్రమంలో బిడెన్ ఆమోదం రేటింగ్ 2023లో 33 శాతానికి పడిపోయిందనేది ఆ వర్గాన్ని ఆందోళన కలిగిస్తుంది. కారణం 2021లో ఈ రేటింగ్ 53 పాయింట్లుగా ఉంది!

దీనికి ప్రధానంగా ఆర్థిక రంగంలో బిడెన్ మంచి విధానాలను రూపొందిస్తున్నారనే విషయంతో ఏకీభవించేవారి సంఖ్య గణనీయంగా పడిపోతుందని తెలుస్తుంది. బిడెన్ ఆర్ధిక విధానాలకు కేవలం 36 శాతం మంది మాత్రమే పాజిటివ్ గా స్పందించారు. దీంతో రెండవసారి బిడెన్ పాలనను ఆశిస్తున్న డెమోక్రాట్‌ లకు ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ఇదే సమయంలో... ఈ వారం విడుదల అయిన సీ.ఎన్.ఎన్. పోల్‌ లో పలు ప్రాంతాల్లో బిడెన్ కంటే ట్రంప్ అత్యధిక పాయింట్లు సాధించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... జార్జియాలో బిడెన్‌ పై ట్రంప్ 5 శాతం పాయింట్లతో ఆధిక్యంలో ఉండగా... 2020లో దాదాపు 1,55,000 ఓట్లతో గెలుపొందిన మిచిగాన్‌ లో బిడెన్‌ పై ట్రంప్ 10 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు పోల్ కనుగొంది.

ఇక్కడ కూడా ప్రధానంగా బిడెన్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే కీలక పాత్ర పోషించబోతున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... జార్జియాలో 54 శాతం, మిచిగాన్‌ లో 56 శాతం ఓటర్లు బిడెన్ అనుసరిస్తున్న విధానాలు అమెరికా ఆర్థిక పరిస్థితులను మరింత దిగజార్చాయని నమ్ముతున్నారని తెలుస్తుంది. దీంతో ట్రంప్ కు రెండోసారి ఛాన్స్ వచ్చే అవకాశాలున్నాయా అనే చర్చ అగ్రరాజ్యంలో మొదలైంది.