భారత్ కు సెకండ్ లేడీ హోదాలో వస్తున్న మనమ్మాయి
తొలిసారి అమెరికా సెకండ్ లేడీ హోదాలో భారత్ కు వస్తున్న ఆమె షెడ్యూల్ తాజాగా ఖరారైంది. తన భర్త జేడీ వాన్స్ తో కలిసి ఏప్రిల్ 21 నుంచి మూడు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు.
By: Tupaki Desk | 12 April 2025 10:36 AM ISTప్రపంచానికి పెద్దన్న అమెరికాకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జేడీ వాన్స్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఏ మాత్రం తీసిపోని పెడసరపు వాన్స్ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే.. అతడితో తెలుగువారికి విడదీయలేని అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. తాను ప్రేమించి పెళ్లాడిన భార్య ఉషా వాన్స్ పదహారణాల తెలుగమ్మాయి అన్న విషయం తెలిసిందే.
తొలిసారి అమెరికా సెకండ్ లేడీ హోదాలో భారత్ కు వస్తున్న ఆమె షెడ్యూల్ తాజాగా ఖరారైంది. తన భర్త జేడీ వాన్స్ తో కలిసి ఏప్రిల్ 21 నుంచి మూడు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఉష మూలాలు ఏపీకి చెందినవన్న విషయం తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు.
తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో జేడీ వాన్స్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు వాణిజ్య.. ఇతర రంగాలకు చెందిన అంశాలు చర్చకు రానున్నాయి. ఈ పర్యటనల్లోనే రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలకు వీలుందని చెబుతున్నారు.
అమెరికా ఉపాధ్యక్షహోదాలో జేడీ వాన్స్ ఉన్నత స్థాయి చర్చల్లో మునిగి తేలే వేళ.. సెకండ్ లేడీ హోదాలో దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని చెబుతున్నారు. ఈ పర్యటనలో వాన్స్ దంపతులు తాజ్ మహాల్ ను వీక్షించనున్నట్లు చెబుతున్నారు. ఆగ్రాతో పాటు జైపూర్ ను కూడా సందర్శిస్తారని చెబుతున్నారు. మరి.. ఈ పర్యటనలో తన మూలాలు ఉన్న ఏపీకి వస్తారా? లేదా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
