Begin typing your search above and press return to search.

అమెరికా ఇచ్చే 4 స్టూడెంట్ వీసాల్లో ఒకటి మనదే

అమెరికా వెళ్లి తమ డాలర్ డ్రీమ్స్ ను నిజం చేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కలలు కంటుంటారు

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:11 AM GMT
అమెరికా ఇచ్చే 4 స్టూడెంట్ వీసాల్లో ఒకటి మనదే
X

అమెరికా వెళ్లి తమ డాలర్ డ్రీమ్స్ ను నిజం చేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కలలు కంటుంటారు. ముఖ్యంగా భారత దేశం నుంచి ఎంతోమంది యువతీయువకులు అమెరికాలో ఎంఎస్ తదితర ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. కోవిడ్ సమయంలో అమెరికా వెళ్లాలనుకునే వారి సంఖ్య కాస్త నెమ్మదించిన గత రెండేళ్లుగా ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో విద్యనభ్యసించేందుకు వస్తున్న వారి కోసం స్టూడెంట్ వీసాల సంఖ్యను కూడా అమెరికా పెంచుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలలకుగాను రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా వీసాలను అమెరికా జారీ చేసిందని భారత్ లోని అమెరికా రాయబారి కార్యాలయం వెల్లడించింది.

అమెరికాలో విద్యనభ్యసించేందుకు ప్రపంచవ్యాప్తంగా జారీ చేస్తున్న ప్రతి నాలుగు వీసాలలో ఒకటి భారత్ లో ఉంటుందని ప్రకటించింది. తమ ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని వెల్లడించింది. అర్హత పొందిన వీసా దరఖాస్తుదారులు సరైన సమయంలో కాలేజీలలో ప్రవేశం పొందాని ఆశించింది. గత ఏడాది 1.25 లక్షల మంది భారతీయ విద్యార్థులకు అమెరికా స్టూడెంట్ వీసాలు జారీ చేసింది. స్డూడెంట్ వీసాలు మంజూరైన దేశాలలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ వేసవి కాలంలోనే 82 వేల మందికి వీసాలను జారీ చేసింది.

ఒకే సీజన్లో దాదాపు 90 వేల వీసాలు మంజూరు చేయడం ఓ రికార్డు. అమెరికాలో ఏటా రెండు సార్లు విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం స్టూడెంట్ వీసాలను విద్యాసంస్థలు అనుమతిస్తాయి. అయితే, ఆగస్టు-డిసెంబర్ సెమిస్టర్ కోసం భారతీయ విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతం దాదాపు రెండు లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలోని పలు విద్యాసంస్థలలో విద్యనభ్యసిస్తున్నారు. భారత్, అమెరికాల మధ్య విద్యాపరమైన అభివృద్ధి కోసం ఇండియా-యూఎస్ గ్లోబల్ ఛాలెంజ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటయింది. వర్చువల్ గా నడుస్తున్న ఈ ఇన్స్టిట్యూట్ ఇరు దేశాలలోని ఉన్నత విద్యా సంస్థల ద్వారా విద్యాపరమైన సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంది.