Begin typing your search above and press return to search.

తాపీ మేస్త్రికి రూ.4.47 ప్యాకేజ్.. యూఎస్ కాన్సులేట్ ప్రకటనలో ఏముంది?

డిగ్రీలు చేసిన వారికి సైతం లేని ప్యాకేజీని తాపీ మేస్త్రీ కోసం ఆఫర్ చేయటం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 4:00 AM GMT
తాపీ మేస్త్రికి రూ.4.47 ప్యాకేజ్.. యూఎస్ కాన్సులేట్ ప్రకటనలో ఏముంది?
X

అవును.. మీరు చదివింది నిజమే. తాపీ మేస్త్రి కోసం హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ ఒక ప్రకటన చేసింది. సోషల్ మీడియాలో కాన్సులేట్ అధికారిక ఖాతాలో ఒక జాబ్ ఆఫర్ వేశారు. తమకు తాపీ మేస్త్రీ అవసరం ఉందని.. అందుకోసం రూ.4.47 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తూ జాబ్ ఆఫర్ చేశారు. డిగ్రీలు చేసిన వారికి సైతం లేని ప్యాకేజీని తాపీ మేస్త్రీ కోసం ఆఫర్ చేయటం ఆసక్తికరంగా మారింది.

పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న వేళ.. తాపీ మేస్త్రీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయటం ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో కొందరు 'అతి’గాళ్ల వల్ల అసలు ప్రకటనకు కొసరుగా తప్పుడు సమాచారాన్ని అతికించటంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాలో తమకు తాపీ మేస్త్రీ కావాలని.. తాము కోరుకున్న అర్హతలు ఉన్న పక్షంలో రూ.4.47 లక్షల వార్షిక ప్యాకేజీతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు.

అయితే.. ఈ నియామకానికి అర్హత పరీక్షలు ఉంటాయని.. తప్పనిసరిగా ఇంగ్లిషు వచ్చి ఉండాలని.. హిందీ లేదా తెలుగు భాషల్ని మాట్లాడాల్సి ఉండాలన్న నిబంధనను పెట్టారు. అంతేకాదు కనీస విద్యార్హత ఎనిమిదో తరగతిగా నిర్ణయించారు. ఫ్లోరింగ్.. మార్బుల్ ఫ్లోరింగ్.. కాంక్రీట్ బ్లాక్స్ వాల్.. స్టోన్ లేయింగ్.. కట్టింగ్.. బ్రిక్ వర్కు తదితర పనుల్లో రెండేళ్ల అనుభవం ఉండాలని కోరుతున్నారు.

దరఖాస్తు చేయటానికి ఫిబ్రవరి 25ను తుది గడువు కింద నిర్ణయించారు. అర్హత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తారు. పని తీరు ఎలా ఉంటుందన్నదానికి సంబంధించిన పరిశీలనతో పాటు ఇతర మార్గాల్లోనూ ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో కొందరు అతిగాళ్లు.. వార్షిక వేతనంగా పేర్కొన్న రూ.4.47 లక్షల మొత్తాన్ని నెల వారీగా మార్చేసి ప్రచారం చేయటంతో కొన్ని గ్రూపుల్లో ఇది కాస్తా వైరల్ గా మారటం గమనార్హం.