Begin typing your search above and press return to search.

భారత్‌ పై అమెరికా రాయబారి సంచలన వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో భారత్‌ పై అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి హాట్‌ కామెంట్స్‌ చేశారు.

By:  Tupaki Desk   |   10 April 2024 7:11 AM GMT
భారత్‌ పై అమెరికా రాయబారి సంచలన వ్యాఖ్యలు!
X

మారుతున్న అవసరాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు, తమకు పోటీగా ఎదుగుతున్న చైనాను అడ్డుకోవడానికి అమెరికా కొన్నేళ్లుగా భారత్‌ తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంటున్న సంగతి తెలిసిందే. హిందూ మహాసముద్రంపై పట్టు, వ్యూహాత్మక ప్రయోజనాల కారణంగా భారత్‌ కు అమెరికా పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో భారత్‌ కు అత్యాధునిక ఆయుధాలను, టెక్నాలజీని అందిస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్‌ పై అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి హాట్‌ కామెంట్స్‌ చేశారు. భారత్‌ తో బంధానికి తమ దేశం ఎంతో ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారతదేశానిది కీలక పాత్ర అని ప్రశంసించారు. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో గార్సెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ దేశంలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురు పత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు భారత్‌ కుట్ర పన్నిందని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు భారతీయులపై అమెరికా అభియోగాలు మోపింది. దీంతో అమెరికా–భారత్‌ మధ్య విభేదాలు పొడసూపాయి. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన కామెంట్ల పట్ల భారత్‌ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. అమెరికా దౌత్య ప్రతినిధిని పిలిపించి సమన్లు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌ కు తాము పాఠాలు బోధించడానికి రాలేదని.. నేర్చుకోవడానికి వచ్చామని ఎరిక్‌ గార్సెట్టి కొనియాడారు. భారత్‌ లో అమెరికా దౌత్య కార్యాలయానికి నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తును చూడాలనుకున్నా.. దాన్ని ఆస్వాదించాలనుకున్నా భారత్‌ కు రావాలని ప్రశంసలు కురిపించారు.

కాగా తమ రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యుత్తమ స్థాయికి చేరుకుంటున్నాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివాన్‌ తెలిపారు. టెక్నాలజీ, భద్రతతో పాటు అనేక రంగాల్లో తమ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు.