'అమెరికాను' వణికిస్తున్న వరదలు.. ఆ రెండు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
భారీ వర్షాలు.. వరదల ప్రభావం ఎంత ఎక్కువగా ఉందంటే.. 1600 విమానాలు రద్దు చేయటమే కాదు.. 10 వేల విమానాలు ఆలస్యంగా నడిచే దుస్థితి.
By: Tupaki Desk | 16 July 2025 9:42 AM ISTఅగ్రరాజ్యం అమెరికాలోని ఈశాన్య ప్రాంతం వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కనుసైగతో ప్రపంచ దేశాల్ని కంట్రోల్ చేయాలని తపించే ‘పెద్దన్న’కు ప్రకృతి పరీక్షలు పెడుతోంది. న్యూయార్క్ తో సహా అమెరికాలోని ఈశాన్య ప్రాంతాల్లో కుండపోతగా కురిసిన వర్షాలతో పలు నగరాలు ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. సహాయక చర్యల్ని చేపట్టారు. పలు రోడ్లు జలమయం కాగా.. పెద్ద ఎత్తున ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరిన దుస్థితి.
భారీ వర్షాలు.. వరదల ప్రభావం ఎంత ఎక్కువగా ఉందంటే.. 1600 విమానాలు రద్దు చేయటమే కాదు.. 10 వేల విమానాలు ఆలస్యంగా నడిచే దుస్థితి. న్యూయార్క్.. వాషింగ్టన్.. బాల్టీమోర్.. నెవార్క్.. న్యూజెర్సీ.. వర్జీనియా లాంటి అనేక ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. న్యూజెర్సీ.. న్యూయార్క్ లలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు. న్యూజెర్సీలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. రోడ్లు.. ఇళ్లు జలమయమయ్యాయి. పార్కుచేసి ఉంచిన కార్లు కాగితం పడవల మాదిరి మారి కొట్టుకుపోయాయి. వీటికిసంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. చెట్లు భారీ ఎత్తున కూలాయి.
వరద తీవ్రతకు న్యూయార్క్ లోని పెద్ద ఎత్తున వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో వాహన డ్రైవర్లకు రెస్క్యూ సిబ్బంది సాయం చేశారు. వరదల నేపథ్యంలో బస్సులు.. రైళ్లు లేట్ గా నడిచాయి. భారీ వర్షాల నేపథ్యంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అరుదైన ప్రకటన చేశారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించటమే కాదు.. ‘పౌరులు ఇళ్లలోనే ఉండాలి. అనవసరమైన ప్రయాణాల్ని మానుకోవాలి’ అన్న సూచన చేశారు.
భారీ వర్షాలు.. వరదల కారణంగా సోమవారం ఒక్క రోజే అమెరికాలో వేలాది విమానాల మీద ప్రభావం పడింది. సుమారు 10 వేల విమానాలు ఆలస్యం కాగా.. 1600 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాను భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందన్న హెచ్చరికల్ని వాతావరణ శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఈ ప్రకటన విమాన రాకపోకలపై ప్రభావాన్ని చూపటమే కాదు.. విమాన ప్రయాణాలు పెట్టుకున్నోళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఇదిలా ఉంటే టెక్సాస్ లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 131కు పెరిగింది. గ్రేటర్ కెర్ విల్లే ప్రాంతంలో 97 మంది గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపులు చేపట్టారు. భారీ వర్షాలు.. వరదల కారణంగా కెర్ కౌంటీలో మరణించిన వారిలో మూడింట ఒక వంతు మంది చిన్నారులే కావటం గమనార్హం.
