Begin typing your search above and press return to search.

చైనీయులతో శారీరక సంబంధాలు పెట్టుకోవద్దు..: అమెరికా ఆదేశాలు

అమెరికా, చైనా మధ్య నెలకొన్న రాజకీయ, ఆర్థిక పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  Tupaki Desk   |   4 April 2025 11:36 AM IST
చైనీయులతో శారీరక సంబంధాలు పెట్టుకోవద్దు..: అమెరికా ఆదేశాలు
X

అమెరికా, చైనా మధ్య నెలకొన్న రాజకీయ, ఆర్థిక పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే అగ్రరాజ్యాలుగా కొనసాగుతున్న ఈ రెండు దేశాలు అన్ని విషయాల్లోనూ ఒకరిని మించి మరొకరు పైచేయి సాధించాలని చూస్తుంటాయి. ఈ క్రమంలోనే తమ దేశానికి సంబంధించిన రహస్యాలు అవతలి వారికి తెలియకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉంటూ తమ దేశ భద్రతకు సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.

తాజాగా అమెరికా ప్రభుత్వం చైనాలో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. కేవలం ఉద్యోగులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా చైనా జాతీయులతో ప్రేమ లేదా శారీరక సంబంధాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రత్యేక ప్రకటన కూడా విడుదల చేసింది.

-చైనీయులతో ప్రేమ, లైంగిక బంధాలపై నిషేధం!

చైనాలో అమెరికా ప్రభుత్వం తరపున పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం చైనా పౌరులతో ఎలాంటి ప్రేమ సంబంధాలు లేదా లైంగిక బంధాలు కలిగి ఉండకూడదని అమెరికా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇలాంటి సంబంధాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఈ ఆంక్షలపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. గతంలో చైనీయులతో సంబంధాలపై అమెరికా ప్రభుత్వం అంత సీరియస్‌గా లేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని కొందరు అధికారులు చెబుతున్నారు.

-రాయబార కార్యాలయాల్లో మరింత కఠిన ఆంక్షలు

ముఖ్యంగా చైనాలోని బీజింగ్, గ్వాంగ్‌జౌ, షాంఘై, షెన్యాంగ్, వుహాన్‌లలో ఉన్న అమెరికా కాన్సులేట్లలో పనిచేస్తున్న సిబ్బంది చైనా పౌరులతో ప్రేమ లేదా శారీరక సంబంధాలు పెట్టుకోవడానికి పూర్తిగా అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే గతంలోనే చైనా పౌరులతో సంబంధాలు కలిగి ఉన్న అమెరికా ఉద్యోగులకు మాత్రం కొంత మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ వారు తప్పనిసరిగా దీని కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వారి దరఖాస్తు తిరస్కరించబడితే, వారు చైనీయులతో తమకున్న బంధాన్ని ముగించుకోవాల్సి ఉంటుంది. అలా చేయలేని పక్షంలో తమ ఉద్యోగాలను సైతం వదులుకోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

గతంలో అంటే జనవరిలో ఈ నిబంధనలపై ఒత్తిడి పెరగకముందు, చైనాలోని అమెరికా సిబ్బంది ఎవరైనా అక్కడి పౌరులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటే ఆ విషయాన్ని తమ పై అధికారులకు నివేదించాల్సి ఉండేది. కానీ అప్పట్లో లైంగిక లేదా శృంగార సంబంధాలపై ఇంత స్పష్టమైన నిషేధం లేదు. అయితే అమెరికా ఇప్పుడు తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం వల్ల ఆ దేశ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం పడుతుందో వేచి చూడాలి.