ముదురుతున్న పెద్దన్న మాటలు... భారత్ పై అమెరికా వివాదాస్పద హెచ్చరికలు!
ఈ సందర్భంగా... అమెరికా కాంగ్రెస్ సభ్యుడు లిండ్సే గ్రాహం స్పందిస్తూ... భారత్, చైనాతో పాటు ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.
By: Tupaki Desk | 22 July 2025 6:08 PM ISTప్రపంచానికి పెద్దన్నగా పిలవబడే అమెరికా వైఖరి.. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత మరింత శృతిమించితుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రపంచానికి ఇప్పుడు చక్రవర్తి అవసరం లేదనే చురకలు ట్రంప్ కు పడుతున్నా.. ఆయన వ్యవహార శైలి నియంతలను మరిపిస్తుందనే కామెంట్లు ఇటీవల వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... భారత్ పై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి.
అవును... ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అది పూర్తిగా ఆ దేశం వ్యక్తిగత విషయం కావొచ్చు.. ఉక్రెయిన్ తో వారికున్న స్నేహం కావొచ్చు.. లేదా, పుతిన్ పై వారికున్న కడుపుమంట కావొచ్చు. కారణం ఏదైనా అది అమెరికా ఇష్టం. ఈ సమయంలో వారి ఇష్టం నెరవేర్చుకోవడం కోసం భారత్ వంటి దేశంపైనా అమెరికా ఘాటైన హెచ్చరికలు జారీ చేస్తుంది.
ఈ సందర్భంగా... అమెరికా కాంగ్రెస్ సభ్యుడు లిండ్సే గ్రాహం స్పందిస్తూ... భారత్, చైనాతో పాటు ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా.. ధర తక్కువగా ఉందని రష్యా వద్ద క్రూడాయిల్ ను కొనుగోలు చేయాలని చూస్తే.. మీ ఆర్ధిక వ్యవస్థను నిట్ట నిలువునా కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి దేశాలపై ట్రంప్ పరిపాలన చమురు సంబంధిత దిగుమతులపై 100 శాతం సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
ఇదే క్రమంలో... భారత్, చైనాతో సహా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాల వస్తువులపై 500 శాతం సుంకాలను విధించాలని కోరుతూ గ్రాహం గతంలో ఒక బిల్లును ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో స్పందిస్తూ... ఉక్రెయిన్ తొ యుద్ధం కొనసాగేలా రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తే.. భారత్, చైనా, బ్రెజిల్ లను కూల్చేస్తామని.. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను అణిచివేస్తామని హెచ్చరించారు.
కాగా, ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపేలా చర్చలకు రావాలని ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఆదేశించారు. అయితే.. ఈ బెదిరింపుల్ని రష్యా ఖండించింది. అమెరికా తమపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై బెదిరింపులకు దిగుతుంది అమెరికా! దీనిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ... ప్రతిపాదిత చట్టంపై భారత అధికారులు ఇప్పటికే సెనేటర్ గ్రాహంతో సంప్రదింపులు జరిపారని అన్నారు.
