అమెరికా వీసాలకు 'సోషల్ మీడియా' చిక్కులు.. ట్రంప్ నిబంధనలతో గందరగోళం
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.
By: Tupaki Desk | 5 Jun 2025 3:00 PM ISTఅమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా, విదేశీ విద్యార్థులకు వీసాలు ఇచ్చే ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిణామంతో భారతీయ విద్యార్థుల్లో అలజడి మొదలైంది. వివాదాస్పదం అవుతాయని భావించిన పోస్ట్‌లను తొలగిస్తూ, ఏకంగా తమ సోషల్ మీడియా ఖాతాలనే తొలగించేస్తున్నారు.
సోషల్ మీడియాలో తాము వ్యక్తం చేసిన రాజకీయ అభిప్రాయాలు వీసా ఇంటర్వ్యూల సమయంలో తప్పుగా అర్థం చేసుకోబడతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఒక సాధారణ కామెంట్ పోస్ట్ కూడా వీసాను రద్దు చేయడానికి కారణం కావచ్చని వారు భయపడుతున్నారు. అమెరికా అధికారులు అనుమతించని కంటెంట్‌ను లైక్ చేయడం లేదా షేర్ చేయడం సమస్యలకు దారితీస్తుందని వీసా కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, ఇలా అకస్మాత్తుగా పోస్ట్‌లు, ఖాతాలను తొలగించడం కూడా అధికారులలో అనుమానాలను రేకెత్తిస్తుందని వారు సూచిస్తున్నారు.
ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థి వీసా అభ్యర్థుల గత ఐదేళ్ల సోషల్ మీడియా వివరాలను అడుగుతారని నిపుణులు వెల్లడించారు. దీని ద్వారా వారి వ్యక్తిత్వాన్ని (Personality) అంచనా వేయవచ్చని వారు చెబుతున్నారు. వీసా లక్ష్యాలకు వారి నేపథ్యం సరిపోతుందా లేదా అని తనిఖీ చేస్తారు. చిన్నపాటి పొలిటికల్ యాక్టివిటీస్, వివాదాస్పద వ్యాఖ్యలు వీసా సమయంలో అనుమానాస్పదంగా పరిగణించబడతాయని వారు హెచ్చరిస్తున్నారు.
వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వవచ్చా లేదా అని అంచనా వేయడానికి అధికారులు వారి ఆన్‌లైన్ యాక్టివీటీస్ కూడా చెక్ చేస్తారు. దీనినే 'సోషల్ మీడియా వెట్టింగ్' (Social Media Vetting) అంటారు. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్‌లను పరిశీలించిన తర్వాత మాత్రమే వీసాలు మంజూరు చేస్తారు. అమెరికా ప్రస్తుతం దీనికి సిద్ధమవుతోంది. ఈ తనిఖీ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు.
