అమెరికా వీసా విధానంలో కీలకమైన మార్పులు
అమెరికా ప్రభుత్వం వీసా విధానంలో కీలకమైన మార్పులను ప్రకటించింది, ఇవి సెప్టెంబర్ 2, 2025 నుండి అమల్లోకి వస్తాయి.
By: Tupaki Desk | 29 July 2025 10:53 AM ISTఅమెరికా ప్రభుత్వం వీసా విధానంలో కీలకమైన మార్పులను ప్రకటించింది, ఇవి సెప్టెంబర్ 2, 2025 నుండి అమల్లోకి వస్తాయి. తాజా ప్రకటన ప్రకారం, ఇకపై H-1B, L-1, F-1, M-1, J-1 వీసా గలవారికి డ్రాప్‌బాక్స్ ద్వారా వీసా పునరుద్ధరణ (రెన్యూవల్) అందుబాటులో ఉండదు. ఈ వీసా కేటగిరీలకు చెందిన దరఖాస్తుదారులు తప్పనిసరిగా కాన్సులేట్‌లో ప్రత్యక్షంగా హాజరై ఇంటర్వ్యూ ఇచ్చి వీసా పొందాల్సి ఉంటుంది.
-ఎవరికి మినహాయింపు?
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. కింది వర్గాల వారికి మాత్రమే ఇంటర్వ్యూ మినహాయింపు వర్తిస్తుంది. A-1, A-2, C-3 (ఆధికారిక వర్గాలు మినహాయించి), G-1 నుండి G-4 వరకూ NATO-1 నుండి NATO-6 వీసాలు, డిప్లొమాటిక్ లేదా అధికారిక వీసాలు,B-1, B-2, లేదా B1/B2 వీసాలు పూర్తి గడువు మినహాయింపుతో 12 నెలల్లోపు తిరిగి అప్లై చేసినవారు అర్హులు. పూర్వపు వీసా మంజూరు సమయంలో కనీసం 18 ఏళ్లు వయస్సు ఉండాలి.
ఇంటర్వ్యూల మినహాయింపు పొందాలంటే:
ఈ మినహాయింపును పొందాలంటే, దరఖాస్తుదారు కింది నిబంధనలను పాటించాలి. వ్యక్తి తన స్వదేశం లేదా నివాస దేశంలోనే అప్లై చేయాలి. పూర్వంలో వీసా నిరాకరణ పొందకూడదు లేదా అది అధిగమించి ఉండాలి. ఎవైనా అర్హతా లోపాలు ఉండకూడదు.
ఈ తాజా మార్గదర్శకాలు ఫిబ్రవరి 18, 2025న విడుదలైన ఇంటర్వ్యూ మినహాయింపు ప్రకటనను రద్దు చేస్తాయి. అయినప్పటికీ కాన్సులర్లు తమ నిర్ణయంపై ఆధారపడి ఏవైనా అనుమానాలున్నా లేదా అవసరమైతే దరఖాస్తుదారులను ఇంటర్వ్యూకు పిలవవచ్చు.
ఏం చేయాలి?
ఈ మార్పులతో వీసా అప్లికేషన్ ప్రక్రియకు పట్టే సమయం పెరిగే అవకాశం ఉంది. కనుక, అమెరికా వెళ్లాలని ఉద్దేశించే H1B, L, F, M, J వీసా దారులు తమ వీసా గడువును ముందుగానే పరిశీలించడం చాలా ముఖ్యం. లొకల్ qbukrje కాన్సులేట్‌లో ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం.. సమయానుసారం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం ఎంతో అవసరం.
మీరు ప్రస్తుతం వీసా కలిగి ఉండి, దాని గడువు త్వరలో ముగియబోతుంటే, డ్రాప్‌బాక్స్ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇది చివరి అవకాశమవుతుంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా వీసా పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మార్పులు వీసా ప్రయాణ ప్రణాళికలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి కాబట్టి, అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.
