అమెరికా వీసా, పౌరసత్వ పరీక్షలు మరింత కఠినం?
ఇటీవల అమెరికా పౌరసత్వం & ఇమిగ్రేషన్ సేవల (USCIS) కొత్త డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లౌ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 27 July 2025 11:12 AM ISTఅమెరికాలో వీసా విధానాలు, పౌరసత్వ పరీక్షలు మరింత కఠినతరం కాబోతున్నాయనే సంకేతాలు అక్కడి అధికార వర్గాల నుంచి వెలువడుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆయన పరిపాలన పునఃసమీక్ష చర్యల్లో భాగంగా విదేశీయుల ప్రవేశం, పౌరసత్వ ప్రదానం వంటి విషయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
పౌరసత్వ పరీక్షల్లో కఠినత్వం
ఇటీవల అమెరికా పౌరసత్వం & ఇమిగ్రేషన్ సేవల (USCIS) కొత్త డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లౌ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం అమలులో ఉన్న పౌరసత్వ పరీక్షలు తేలికగా మారాయని, అభ్యర్థులు కేవలం పాఠాలు చదివినట్లే సమాధానాలు ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాయని విమర్శించారు. అందువల్ల ఈ పరీక్షలను మరింత క్లిష్టంగా, విశ్లేషణాత్మకంగా మార్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
హెచ్-1బీ వీసాలపై సమీక్ష
అంతేకాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హెచ్-1బీ వీసాలపై కూడా సమీక్ష చేపట్టనున్నట్లు జోసెఫ్ తెలిపారు. నైపుణ్యం కలిగిన విదేశీయుల కోసం ఇచ్చే ఈ వీసాలను ఎలా మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చనే అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. ఈ వీసాల మంజూరు విధానంలో పారదర్శకత, నియంత్రణ పెంచేలా మార్పులు జరగొచ్చని భావిస్తున్నారు.
ట్రంప్ పాలనలో మార్పులు
గతంలో ట్రంప్ తన తొలి అధ్యక్ష పర్యాయం నాడు వీసా వ్యవస్థను కఠినతరం చేసే దిశగా పలు చర్యలు చేపట్టారు. అయితే తర్వాత బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుని, మానవతావాదంతో కూడిన విధానాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ట్రంప్ తిరిగి అధికారం చేపట్టిన నేపథ్యంలో మళ్లీ కఠిన విధానాలు అమలవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికాలో నివసించాలనే ఆశలు పుచ్చుకున్నవారితో పాటు, అక్కడ ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతలో ఆందోళన నెలకొంది. వీసా ప్రక్రియలు, పౌరసత్వ పరీక్షల్లో మార్పుల దిశగా అధికార వర్గాలు ముందుకు సాగుతుంటే, ఆయా మార్పులు తమపై ఎలా ప్రభావం చూపుతాయోననే అనిశ్చితి నెలకొంటోంది.
అమెరికాలో వీసాలు, పౌరసత్వ పరీక్షల విధానాల్లో కీలక మార్పులు ఖచ్చితంగా వచ్చే అవకాశముందని తాజా ప్రకటనల ద్వారా స్పష్టమవుతోంది. ఇవి భారతీయులు సహా అనేక దేశాల నుంచి అమెరికాలోకి వెళ్లే ఆశతో ఉన్నవారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
