యూఎస్ పౌరులకు ‘స్వేచ్ఛ’.. మరి ఇతర దేశాల వారికి వద్దా ట్రంప్?
అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అమెరికన్లు చేసే పోస్టులు, కామెంట్లను సెన్సార్ చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారులపై కొత్తగా వీసా నిషేధాన్ని ప్రకటించింది.
By: Tupaki Desk | 29 May 2025 1:05 PM ISTఅమెరికా పౌరులు ఏమైనా మాట్లాడవచ్చు. ఇష్టమొచ్చింది పోస్ట్ చేయవచ్చట.. వారిపై ఇతర దేశాలు యాక్షన్ తీసుకుంటే మాత్రం ట్రంప్ ఊరుకోడట.. అమెరికా పౌరులకు ఉండే స్వేచ్ఛ.. మరి ఇతర దేశాల సార్వభౌమాధికారానికి ఉండదా? ఆ దేశాలు అమెరికన్లు ఏం వాగినా చేసినా మిన్నకుండాలా? అసలు అంతదాకా ఎందుకు? అమెరికాలో పాలస్తీనా వ్యతిరేకులను దేశబహిష్కరణ చేస్తున్న అమెరికా.. ఇతర దేశాల్లో ఇలా చేస్తే అసలు చర్యలు తీసుకోవద్దట.. ఇదేం న్యాయం అంటూ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త పాలసీపై ప్రపంచ దేశాలన్నీ గుర్రుగా ఉన్నాయి.
అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అమెరికన్లు చేసే పోస్టులు, కామెంట్లను సెన్సార్ చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారులపై కొత్తగా వీసా నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా తమ దేశానికి చెందిన సామాజిక మాధ్యమాలకు కంటెంట్‌ను తీసేయమని నోటీసులు పంపడం, ఒత్తిడికి గురిచేసిన వారిపైనా ఈ వీసా నిషేధం అమలుకానున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
-నిర్ణయానికి కారణం:
ఇటీవల పలు దేశాల ప్రభుత్వాల నుంచి యూఎస్ సోషల్ మీడియా కంపెనీలకు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. "అమెరికా పౌరులు లేదా నివాసితులు తాము సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లను, కామెంట్లను తొలగించమని ఒత్తిడికి గురిచేయడం, అరెస్టు వారెంట్లు జారీ చేయడం, యూఎస్ టెక్ కంపెనీలను సైతం ఒత్తిడికి గురిచేసే విదేశీ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త పాలసీ తీసుకొచ్చాం" అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. విదేశీ అధికారులు ఇలా అమెరికా పౌరులను, టెక్ కంపెనీలను ఒత్తిడికి గురిచేయడం అనైతికం అన్నారు. అంతేకాకుండా గ్లోబల్ కంటెంట్ మోడరేషన్ విధానాలు అవలంభించడం లేదా వారి అధికార పరిధి దాటి సెన్సార్‌షిప్ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఇతర దేశాల అధికారులు యూఎస్ టెక్ కంపెనీలను డిమాండ్ చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు.
-ఎలాంటి దేశాలు, అధికారులు లక్ష్యం?
అయితే, ఏ దేశం పేరును గానీ, అధికారులను గానీ మార్కో రూబియో నేరుగా ప్రస్తావించలేదు. కొంతమంది విదేశీ అధికారులు ఇటీవల ఎలాంటి చట్టపరమైన అనుమతి లేనప్పటికీ అమెరికా టెక్ కంపెనీలపై సెన్సార్‌షిప్ చర్యలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఇటీవల పలు దేశాల ప్రభుత్వాలు అమెరికా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమకు వ్యతిరేకంగా ఉన్న పోస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాలు జరిమానాలు సైతం విధించాయి. ఈ నేపథ్యంలోనే కొత్త పాలసీని అమెరికా ప్రకటించింది.
-అమెరికా వాదన:
అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, యూఎస్ పౌరుడు ఎవరైనా అమెరికా గడ్డ మీది నుంచి తమ దేశానికి చెందిన సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఇతర దేశాల ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి హక్కు లేదు. ప్రపంచంలోని ప్రధాన సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా అమెరికన్లకు చెందినవే ఉన్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (మార్క్ జూకర్‌బర్గ్), యూట్యూబ్ (గూగుల్), ఎక్స్ (ఎలాన్ మస్క్), ట్రూత్ (డొనాల్డ్ ట్రంప్), బ్లూస్కై (జాక్ డోర్సే) వంటి ప్రధాన సోషల్ మీడియా యజమానులు అమెరికాకు చెందినవారే. ఈ నిర్ణయం ద్వారా తమ పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు, అమెరికా టెక్ కంపెనీలపై పెరుగుతున్న విదేశీ ఒత్తిడిని తగ్గించాలనేది అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది.
