యుఎస్ వీసా స్లాట్లలో గందరగోళం: లండన్‌లో బుకింగ్, ఆఫ్రికాలో ఇంటర్వ్యూలు?
యునైటెడ్ కింగ్‌డమ్‌లో యుఎస్ వీసా అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసుకున్నవారికి ఊహించని షాక్ తగిలింది.
By: Tupaki Desk | 29 Jun 2025 3:24 PM ISTయునైటెడ్ కింగ్‌డమ్‌లో యుఎస్ వీసా అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసుకున్నవారికి ఊహించని షాక్ తగిలింది. ధృవీకరించబడిన ఇంటర్వ్యూలు రద్దవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆఫ్రికాలోని జింబాబ్వే దేశ రాజధాని హరారేకి మారడం కలకలం రేపుతోంది. ఈ పరిణామంపై వీసా అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వీసా అభ్యర్థులు తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. కొందరు తమ ఆగస్టు 28వ తేదీన షెడ్యూల్ చేయబడిన ఇంటర్వ్యూలు అకస్మాత్తుగా సెప్టెంబర్ 2వ తేదీకి మారినట్టు మెయిల్ వచ్చిందని పంచుకుంటే, మరికొందరు తమ అకౌంట్లలో ఇంటర్వ్యూ వేదిక హఠాత్తుగా హరారేగా మారిపోయిందని వెల్లడించారు.
ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ ఇమెయిల్స్‌లో "Dear Visa aplicant" అనే తప్పుడు స్పెల్లింగ్‌తో సందేశాలు పంపించడం దరఖాస్తుదారులను షాక్ కు గురిచేసింది. మొదట వీటిని ఫిషింగ్ మోసాలుగా భావించినప్పటికీ ఇవి నిజమైన రీషెడ్యూలింగ్‌లే అని తరువాత అర్థమైంది. నెలల తేదీలు మారడం సర్వసాధారణంగా మారింది. ఆగస్టు నుంచి అక్టోబర్‌కు, సెప్టెంబరు నుంచి ఏకంగా జనవరి 2026కు మారినట్లు బాధితులు వాపోతున్నారు.
సహనం కోల్పోతున్న అభ్యర్థులు
ఈ మార్పులకు ఎటువంటి కారణమూ చెప్పకుండా వేరే ఎంపికలు లేవని, డబ్బు తిరిగి ఇవ్వడం లేదని, కస్టమర్ కేర్ నుండి ఎటువంటి సమాధానం రావడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీసా అభ్యర్థుల్లో కొంతమంది దీనిని సాంకేతిక లోపంగా భావిస్తుండగా, మరికొంతమంది దౌత్య కార్యాలయంపై పడుతున్న భారం వల్ల ఇలాంటి మార్పులు జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు దీనిని ఉద్దేశపూర్వకంగా వీసా ప్రక్రియను ఆలస్యం చేసి, ప్రజలను మళ్లీ దరఖాస్తు చేయించుకోవడానికి చేసే "డబ్బు వృథా" చేసే వ్యూహంగా ఎద్దేవా చేస్తున్నాయి.
భవిష్యత్తుపై ప్రభావం
విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు కోరుకుంటున్నవారికి వీసా అపాయింట్‌మెంట్‌లు వారి జీవితాలను ప్రభావితం చేసే అంశాలు. ఇటువంటి గందరగోళపు మార్పులు అభ్యర్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిపై యుఎస్ అధికారులు స్పష్టత ఇవ్వాలని, పారదర్శక విధానం పాటించాలని వీసా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం లభించాలని ఆశిద్దాం.
