భారత్-పాక్ ఉద్రిక్తతలు: అమెరికాది ప్రేక్షకపాత్రే - జోక్యం చేసుకోబోమన్న ఉపాధ్యక్షుడు
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 9 May 2025 9:15 AM ISTభారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరింతగా బలపరుస్తున్నాయి.
ఫాక్స్ న్యూస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జేడీ వాన్స్ ఈ అంశంపై స్పందించారు. "రెండు అణుశక్తి దేశాల మధ్య ఘర్షణలు తలెత్తి, అది పెద్ద సంక్షోభానికి దారితీయడంపై మేము ఆందోళన చెందుతున్నాం. వీలైనంత త్వరగా పరిస్థితులు శాంతించాలని మేము బలంగా కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు.
పాకిస్తాన్‌పై భారత్‌కు కొన్ని ఫిర్యాదులున్నాయని, వాటిపై న్యూదిల్లీ చర్యలకు పాక్ స్పందిస్తోందని గుర్తించిన వాన్స్, పరిస్థితులు సద్దుమణిగేలా ఇరు దేశాలను ప్రోత్సహించగలమే తప్ప, యుద్ధంలో మాత్రం తాము తలదూర్చబోమని స్పష్టం చేశారు. "అది మా పని కాదు. అమెరికాతో దానికి ఏమాత్రం సంబంధం లేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఆయుధాలు వదిలేయమని అమెరికా నేరుగా చెప్పదని, అయితే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడమే ఏకైక మార్గమని, అది ప్రాంతీయ సంక్షోభానికి దారితీయకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.
-అమెరికా తీరుపై విమర్శలు..
గతంలో రష్యాపై, అఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లపై పోరులో పాకిస్తాన్‌ను ఉపయోగించుకున్న అమెరికా, ఇప్పుడు భారత్‌తో ఉద్రిక్తతల సమయంలో జోక్యానికి దూరంగా 'సైలెంట్ మోడ్'లోకి వెళ్లడం గమనార్హం. ఎవరికీ మద్దతు ప్రకటించకుండా అమెరికా నిష్పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నట్టుగా పైకి కనిపిస్తున్నా, దీని వెనుక వేరే కారణాలు ఉండొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి.
నిజానికి, భారత ప్రధాని మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మంచి స్నేహం ఉన్నప్పటికీ, భారత్‌కు మద్దతు ప్రకటించకుండా అమెరికా వ్యవహరించిన తీరును కొందరు పాకిస్తాన్‌కు అనుకూల వైఖరిగా చూడవచ్చు. అయితే, యుద్ధంలో జోక్యం చేసుకోమన్న అమెరికా ప్రకటన భారత్‌కు నేరుగా మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేస్తోంది. అదే సమయంలో, ఈ ప్రకటన ద్వారా పాకిస్తాన్‌కు కూడా తాము నేరుగా అండగా ఉండబోమని అమెరికా పరోక్షంగా సూచిస్తున్నట్టుగా కూడా భావించవచ్చు. అంటే, ఇరు దేశాలు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలని అమెరికా కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
కాగా, గురువారం రాత్రి భారత్-పాక్ సరిహద్దులో ఘర్షణలు పతాక స్థాయికి చేరాయి. పొరుగుదేశం నుంచి వచ్చిన దాదాపు 50 డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మొత్తమ్మీద, భారత్-పాక్ ఉద్రిక్తతల విషయంలో అమెరికా జోక్యానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇరు దేశాలు చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తూ, తాను కేవలం ఒక 'ప్రేక్షకపాత్ర'కు పరిమితమైంది. ఇది అమెరికా విదేశాంగ విధానంలో ఒక వ్యూహాత్మక మార్పుగా భావించవచ్చు.
