Begin typing your search above and press return to search.

భారత్ కు ఒంటరిగా వెళ్లొద్దు.. అమెరికా సంచలన హెచ్చరిక

భారత్‌ వెళ్లే తమ పౌరులకు, ముఖ్యంగా మహిళలకు అమెరికా ఆకస్మాత్తుగా జారీచేసిన ట్రావెల్ అడ్వైజరీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 6:00 PM IST
భారత్ కు ఒంటరిగా వెళ్లొద్దు.. అమెరికా సంచలన హెచ్చరిక
X

భారత్‌ వెళ్లే తమ పౌరులకు, ముఖ్యంగా మహిళలకు అమెరికా ఆకస్మాత్తుగా జారీచేసిన ట్రావెల్ అడ్వైజరీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత జూన్ 16న అమెరికా విదేశాంగ శాఖ లెవెల్-2 ట్రావెల్ వార్నింగ్‌ను జారీ చేసింది. భారత్‌లో అత్యాచారాలు, ఉగ్రదాడులు పెరుగుతున్నాయని పేర్కొంటూ ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించవద్దని స్పష్టం చేసింది. ఈ హెచ్చరిక భారత ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ప్రతికూల దృష్టి పెరగడానికి దారి తీయనుందని అనిపిస్తోంది.

అమెరికా ట్రావెల్ అడ్వైజరీ ప్రకారం, భారతదేశంలో అత్యంత అప్రమత్తత అవసరమైన ప్రాంతాలుగా కొన్నిటిని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ లో భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ ప్రయాణాన్ని నివారించాలని సూచించింది. భారత-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు అధికంగా ఉన్నాయని హెచ్చరించింది. తూర్పు, మధ్య భారతదేశం (మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు), తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పరిస్థితులు సురక్షితం కావని హెచ్చరించింది. ఇక్కడ పనిచేస్తున్న అమెరికా ఉద్యోగులు ప్రయాణించాలంటే ప్రత్యేక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్‌లలో కూడా అమెరికా ఉద్యోగులకు ముందస్తు అనుమతి తప్పనిసరి. మణిపూర్, అసోం, త్రిపురలలో భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, ప్రయాణాన్ని నివారించాలని సూచించింది.

- మహిళల కోసం ప్రత్యేక సూచనలు

అత్యంత గమనించదగిన అంశం ఏంటంటే, మహిళలు ఒంటరిగా భారతదేశంలో ప్రయాణించవద్దని ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. "భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేరాల్లో అత్యాచారాలు ప్రధానమైనవి" అని పేర్కొంది. పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు, రవాణా కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు హింసాత్మక నేరాలకు, ఉగ్రదాడులకు గురయ్యే ప్రమాదం ఉందని వివరించింది.

- భారత్-నేపాల్ సరిహద్దు గురించి హెచ్చరిక

భారత్-నేపాల్ భూమార్గం ద్వారా ప్రయాణించడం వల్ల ఇమ్మిగ్రేషన్ సమస్యలు, డిటెన్షన్, జరిమానాల ప్రమాదం ఉన్నందున ఆ మార్గానికి దూరంగా ఉండాలని సూచించింది. భద్రతా పరిస్థితులు సరిగా లేవని పేర్కొంది.

ఈ హెచ్చరికలు భారత ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా భారత్‌లో భద్రతా పరిస్థితులు సరిగా లేవనే అభిప్రాయాన్ని పెంచేలా అమెరికా అడ్వైజరీ ఉంది. ఇదే సమయంలో పాకిస్థాన్ సైనిక అధిపతికి వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఆహ్వానం ఇవ్వడం, అమెరికా-పాక్ సంబంధాల్లో తీపి మాటలు వినిపించడంతో భారత్‌కి అమెరికా వైఖరి ఏమిటన్న సందేహాలు నెలకొన్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా భారత్ పట్ల మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముందా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. కాలమే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.