అమెరికా టెక్ ప్రపంచంలో సరికొత్త తుఫాను
ఒకప్పుడు ఆ ఉద్యోగమే ఒక కల.. ఐటీ ప్రపంచంలో అడుగుపెడితే జీవితం స్థిరపడినట్లే అని నమ్మిన వేలాది మంది టెక్ నిపుణుల జీవితాల్లో ఇప్పుడు ఆందోళన నిండిపోయింది.
By: A.N.Kumar | 30 Sept 2026 4:13 PM ISTరేపటి గురించి ఆశలతో ఆఫీస్ గుమ్మంలో అడుగుపెట్టిన వేలాది మంది టెక్ నిపుణులకు.. ఈరోజు ఇమెయిల్‌లో వచ్చే ఒక్క మెసేజ్ జీవితాన్ని తలకిందులు చేస్తోంది. కళ్ళల్లో వేయి కాంతులతో.. రేపటి భవిష్యత్తు కోసం అహర్నిశలూ శ్రమించిన చేతులే.. ఇప్పుడు ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై "యువర్ రోల్ హాస్ బీన్ ఎలిమినేటెడ్" అనే నిష్ఠుర సత్యాన్ని చూసి అచేతనమైపోతున్నాయి. అప్పటిదాకా కంపెనీని తమ సొంత ఇల్లులా భావించి కష్టపడిన ఉద్యోగులు.. మరుసటి క్షణమే కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో కేవలం ఒక "ఖర్చు"గా మారి వీధిలోకి తోసేయబడుతుంటే.. టెక్ ప్రపంచం ఐడీ కార్డ్ వెనుక దాగున్న కన్నీళ్లను.. ఆందోళనలను పట్టించుకోకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతోంది.
ఒకప్పుడు ఆ ఉద్యోగమే ఒక కల.. ఐటీ ప్రపంచంలో అడుగుపెడితే జీవితం స్థిరపడినట్లే అని నమ్మిన వేలాది మంది టెక్ నిపుణుల జీవితాల్లో ఇప్పుడు ఆందోళన నిండిపోయింది. అమెరికా టెక్ ప్రపంచంలో సరికొత్త తుఫాను చెలరేగుతోంది. నిన్నటిదాకా ఆధునిక సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దిగ్గజ కంపెనీలు.. ఇప్పుడు "ఖర్చులు తగ్గించుకోవాలి" అనే ఒకే ఒక్క మాటతో ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
మానవ శక్తికి ప్రత్యామ్నాయంగా ఏఐ.. గుండెల్లో గుబులు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధి చెందుతున్న కొద్దీ సంతోషించాల్సింది పోయి.. టెక్ ఉద్యోగులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంపెనీలు తమ ప్రాధాన్యతలను మార్చుకుంటూ ఏఐ ప్రాజెక్టుల్లోకి భారీగా పెట్టుబడులను మళ్లిస్తున్నాయి. దీనివల్ల సాంప్రదాయ ఉద్యోగాలకు గండం ఏర్పడుతోంది. మేనేజ్‌మెంట్ స్థాయిలను కుదించడం పేరుతో వేలాది మందిని అర్ధాంతరంగా ఇళ్లకు పంపించేస్తున్నారు.
యాపిల్ లోనూ అదే టెన్షన్.. జాన్ టెర్నస్ నిర్ణయాలపై ఉత్కంఠ
ఎలాంటి ఆపద రాదు అని భావించే 'యాపిల్' సంస్థలోనూ ప్రస్తుతం ఆందోళనకర వాతావరణం నెలకొంది. సంస్థను మరింత సన్నద్ధంగా మార్చే క్రమంలో మిడిల్ మేనేజ్‌మెంట్‌కు కోతలు పెట్టి ఇంజినీర్లను నేరుగా టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో పనిచేయించే దిశగా కొత్త మార్పులు జరుగుతున్నాయి. ఉత్పత్తుల లాంచ్ సైకిల్‌ను మార్చడం.. కొన్ని విభాగాల్లో నిశ్శబ్దంగా కోతలు విధిస్తుండటం ఉద్యోగులకు నిద్రలేకుండా చేస్తోంది. సిరి, విజన్ ప్రో, ఏఐ సాఫ్ట్‌వేర్ విభాగాలపైనా ఈ ప్రభావం కనిపిస్తుండటంతో తదుపరి ఎవరి వంతు వస్తుందోనని ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు.
దిగ్గజాల బాటలోనే వర్క్‌డే, ఒరాకిల్, అమెజాన్
కేవలం యాపిల్ మాత్రమే కాదు.. వర్క్‌డే తన సిబ్బందిలో 2.5 శాతం సుమారు 500 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉబర్ ఏకంగా 3,300 మందిని ఇంటికి పంపే ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో పయనిస్తూ ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. క్రంచ్ బేస్ గణాంకాల ప్రకారం.. 2026 ప్రారంభం నుంచి ఆగస్టు నాటికి కనీసం 94,046 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇది గతేడాదితో పోలిస్తే 16.8 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
మొత్తంగా అమెరికా లేబర్ మార్కెట్ స్థిరంగా ఉన్నప్పటికీ టెక్ రంగాన్ని నమ్ముకున్న మానవ వనరుల పరిస్థితి మాత్రం రోజురోజుకూ అభద్రతాభావంలోకి నెట్టబడుతోంది. కష్టపడి నిర్మించుకున్న కెరీర్లు ఒక్క నిమిషంలో ముగిసిపోతున్నాయనే వేదన టెక్ ఉద్యోగులను ఊపిరాడనివ్వడం లేదు.
