అమెరికా మిత్రుల కంటే శత్రువులే ఈ టారీఫ్ తీర్పుతో ఎక్కువ లాభం
రక్షణవాద ధోరణితో అమెరికా వేసిన గోడలు బద్ధలవ్వడంతో ఇప్పుడు భారత్ వంటి దేశాల ముందు అటు అవకాశాలు, ఇటు సవాళ్లు సమానంగా నిలిచాయి.
By: A.N.Kumar | 23 Feb 2026 8:05 PM ISTఅమెరికా సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు ప్రపంచ వాణిజ్య యవనికపై ఒక పెనుదుమారాన్ని సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో 'అమెరికా ఫస్ట్' నినాదంతో, అత్యవసర అధికారాలను (ఐఈఈపీఏ) అడ్డుపెట్టుకుని విధించిన ఏకపక్ష టారిఫ్‌లను కోర్టు కొట్టివేయడం కేవలం ఒక న్యాయపరమైన విజయం మాత్రమే కాదు.. ఇది ప్రపంచ దేశాల మధ్య ఉన్న ఆర్థిక సమీకరణాలను పూర్తిగా మార్చివేసే పరిణామం. రక్షణవాద ధోరణితో అమెరికా వేసిన గోడలు బద్ధలవ్వడంతో ఇప్పుడు భారత్ వంటి దేశాల ముందు అటు అవకాశాలు, ఇటు సవాళ్లు సమానంగా నిలిచాయి.
నిరంకుశత్వానికి న్యాయబద్ధమైన కళ్లెం
ట్రంప్ ప్రభుత్వం అత్యవసర ఆర్థిక అధికారాలను ఉపయోగించి విదేశీ వస్తువులపై భారీ సుంకాలను మోపడం ద్వారా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలను పక్కన పెట్టింది. అయితే, సుప్రీంకోర్టు ఈ విధానాన్ని చట్టవిరుద్ధమని తేల్చడంతో అమెరికా ఇప్పుడు తన పాత పంథాను వీడి సెక్షన్ 122 కింద 15% సాధారణ టారిఫ్ విధానానికి రావాల్సి వచ్చింది. ఇది తాత్కాలికమే అయినప్పటికీ అమెరికా కస్టమ్స్ విభాగం పాత కోడ్‌లను రద్దు చేయడం అంతర్జాతీయ ఎగుమతిదారులకు పెద్ద ఊరట.
చైనాకు 'వరప్రసాదం'.. మిత్రులకు 'వంచన'?
ఈ తీర్పుతో అత్యంత విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అమెరికా ప్రధాన శత్రువుగా భావించే చైనాకు ఇది అనూహ్య లాభాన్ని చేకూర్చింది. గతంలో చైనా వస్తువులపై ఉన్న భారీ సుంకాలు తగ్గి అందరితో సమానంగా 15 శాతానికి చేరడంతో చైనా మార్కెట్లు ఉత్సాహంగా ఉన్నాయి. మరోవైపు అమెరికాకు అత్యంత నమ్మకమైన మిత్రదేశాలైన బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు గతంలో 10% రాయితీని పొందేవి. ఇప్పుడు అవి కూడా 15% చెల్లించాల్సి రావడం ఆ దేశాలకు మింగుడుపడని అంశం. అంటే అమెరికా మిత్రుల కంటే శత్రువులే ఈ తీర్పుతో ఎక్కువ లాభపడ్డారు.
భారత్ ముందున్న దౌత్య పరీక్ష
భారతదేశానికి ఇది ఒక 'ద్వంద్వ తల్వార్' వంటిది. ఒకవైపు అమెరికాతో వాణిజ్య చర్చల్లో భారత్‌కు ఇప్పుడు 'నెగోషియేషన్ పవర్' పెరిగింది. పాత సుంకాల భయం లేకపోవడంతో భారత్ తన ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్ రంగాల ప్రయోజనాల కోసం గట్టిగా పట్టుబట్టవచ్చు. అందుకే భారత్ తన ప్రతినిధుల పర్యటనను వాయిదా వేసి, ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే 150 రోజుల గడువు ముగిసిన తర్వాత అమెరికా కాంగ్రెస్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో అన్న అనిశ్చితి భారత ఎగుమతిదారులను కలవరపెడుతోంది.
ప్రస్తుతానికి డాలర్ విలువ తగ్గడం, ఆసియా మార్కెట్లలో ఉత్సాహం కనిపించడం సానుకూల అంశాలే. కానీ ప్రపంచీకరణ యుగంలో ఏకపక్ష నిర్ణయాలు ఎంతటి గందరగోళాన్ని సృష్టిస్తాయో ఈ పరిణామం నిరూపించింది. భారత్ ఇప్పుడు భావోద్వేగాలకు పోకుండా ఈ 150 రోజుల వెసులుబాటును వాడుకుని శాశ్వత ప్రాతిపదికన అనుకూల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంపై దృష్టి సారించాలి. అమెరికా అంతర్గత రాజకీయాలు.. న్యాయవ్యవస్థ పోరాటాల మధ్య, భారత ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడమే ఇప్పుడు దౌత్యవేత్తల ముందున్న అసలైన సవాలు.
