విద్యార్థి వీసాలపై అమెరికా కొత్త ఆంక్షలు!
ఈ ప్రతిపాదనల ప్రభావం ఎక్కువగా భారతీయ విద్యార్థులపై పడే అవకాశముంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో ఉన్న వర్సిటీల్లో చదువుకుంటున్నారు.
By: Tupaki Desk | 2 July 2025 8:41 PM ISTఅమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ విద్యార్థులకు మరోసారి కొత్త ఆంక్షలు గందరగోళానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థి వీసాలపై కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక మార్పు చేయాలని భావిస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఇకపై విద్యార్థి వీసాలకు 'టైం లిమిట్' విధించనున్నారు. అంటే ఫిక్స్‌డ్ డ్యూరేషన్‌తో కూడిన స్టూడెంట్ వీసాలు మాత్రమే మంజూరు చేయనున్నారు.
- ఇప్పటివరకు ఎలా ఉంది?
ప్రస్తుతం అమెరికాలో ఎఫ్-1 (F-1) విద్యార్థి వీసాలు , జే-1 (J-1) ఎక్స్ఛేంజ్ వీసాలతో ఉన్న విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనే వెసులుబాటు ఉంది. దీని ప్రకారం విద్యార్థి తన కోర్సు పూర్తయ్యేంతవరకూ అమెరికాలో ఉండవచ్చు. ఈ విధంగా, విద్యార్థులు ఎలాంటి గడువు ఆందోళన లేకుండా చదువు పూర్తయ్యే వరకూ కొనసాగించగలుగుతున్నారు. అంతేగాకుండా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనే స్కాలర్లు, ఫిజీషియన్లు, ఇంటర్న్లు, ట్రైనీలు వంటి ఇతర వర్గాలకు కూడా ఇదే సదుపాయం వర్తించేది.
- కొత్తగా ఏమి మారబోతోంది?
హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తాజా ప్రతిపాదనల ప్రకారం ఇకపై విద్యార్థి వీసాలు పరిమిత కాల గడువుతోనే మంజూరు చేయాలన్న ఉద్దేశంతో ఉంది. అంటే వీసా గడువు ముగిసిన తర్వాత విద్యార్థులు తప్పనిసరిగా వీసా పొడిగింపు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేరుగా విద్యార్థులపై ఆర్థిక భారం, మానసిక ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంది. ప్రతిపాదనలు ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (OMB)కి సమర్పించబడ్డాయి. ఈ ప్రతిపాదనలను తర్వాత ఫెడరల్ రిజిస్టరీలో ప్రచురించి, 30-60 రోజుల పాటు పబ్లిక్ కామెంట్స్ ను ఆహ్వానిస్తారు. అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే తక్షణమే అమలులోకి వచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశమూ ఉన్నట్లు సమాచారం.
- భారతీయ విద్యార్థులపై ప్రభావం
ఈ ప్రతిపాదనల ప్రభావం ఎక్కువగా భారతీయ విద్యార్థులపై పడే అవకాశముంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో ఉన్న వర్సిటీల్లో చదువుకుంటున్నారు. కొత్త నిబంధనలు అమలైతే వారంతా తరచుగా వీసా పొడిగింపు కోసం నానా తంటాలు పడాల్సి ఉంటుంది.
- నిపుణుల ఆందోళనలు
న్యాయనిపుణులు , విద్యార్థుల సంఘాలు ఈ ప్రతిపాదనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మార్పులు అనవసరంగా విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతాయని, వారి చదువుల్లో అంతరాయం కలిగించే ప్రమాదముందని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల భద్రత పేరిట చేస్తున్న ఈ మార్పులు, వాస్తవానికి వారి భవిష్యత్తును దెబ్బతీసేలా మారవచ్చన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి.
విదేశీ విద్యార్థులపై గడువులు విధించడం వల్ల అనేకమంది ప్రతిభావంతుల్ని అమెరికా వెళ్లేందుకు నిరుత్సాహపరచే ప్రమాదం ఉంది. భారతీయ విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ప్రతిపాదనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వచ్చే రోజుల్లో ఈ ప్రతిపాదనల తుది రూపం ఎలా ఉండబోతోందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో, ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయాలు తెలియజేయడం ద్వారా మార్పులు తేవడానికి అవకాశం ఉంది.
