ట్రంప్ దెబ్బకు విద్యార్థుల బతుకులు ఆగమాగం.. తెలుగు వారికి లాయర్ హెచ్చరిక!
రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అప్పటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
By: Tupaki Desk | 18 April 2025 6:49 PM ISTరానురాను అనేక మంది అమెరికా కల చెదిరిపోతోందా? ట్రంప్ పాలనలో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యతు మీద ఆందోళన చెందుతున్నారు. చిన్న పొరపాట్లు కూడా వారి వీసాలను రద్దు చేస్తున్నాయి. లాయర్ల ఫీజులు ఆకాశాన్ని అంటుతుండడంతో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తెలుగు విద్యార్థులకు నిపుణులు చేస్తున్న హెచ్చిరకలు ఏంటో తెలుసుకుందాం.
రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అప్పటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విద్యార్థి వీసాల విషయంలో ఆయన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో చిన్న పొరపాట్లు కూడా వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వీసాలు రద్దు చేసి దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశిస్తుండటం, ఓపీటీ ప్రోగ్రామ్‌ను రద్దు చేసే యోచనలు విద్యార్థులను మరింత కలవరపెడుతున్నాయి. క్యాంపస్ వెలుపల ఉద్యోగం చేయడం నేరంగా పరిగణించడంతో చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ సంక్షోభంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహాయం చేయడానికి కొందరు ముందుకు వచ్చారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4 నుండి ఇప్పటివరకు దాదాపు 4,700 మంది విద్యార్థుల సెవీస్ టెర్మినేషన్ జరిగింది. 200 యూనివర్సిటీల్లోని విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. డ్రంకెన్ డ్రైవ్, షాప్ లిఫ్టింగ్ వంటి చిన్న నేరాల్లో పట్టుబడిన విద్యార్థులకు వీసా సమస్యలు తప్పడం లేదు. ఈ కేసులను ఎదుర్కోవడానికి లాయర్లకు భారీగా ఫీజులు చెల్లించాల్సి వస్తుండడంతో చాలా మంది తమ ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
నిపుణులు తెలుగు విద్యార్థులకు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో ఉన్నంత కాలం అక్కడి చట్టాలను తప్పకుండా పాటించాలని సూచించారు. చిన్న పొరపాటు కూడా మీ వీసాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్, షాప్ లిఫ్టింగ్ వంటి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా వీసా సమస్యలు ఎదుర్కొంటుంటే వెంటనే అనుభవజ్ఞులైన ఇమిగ్రేషన్ లాయర్లను సంప్రదించాలి. వీసా కేసుల విచారణకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని, భారీగా ఫీజులు చెల్లించాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. కాబట్టి విద్యార్థులు ఆర్థికంగా కూడా రెడీగా ఉండాలని సూచించారు.
ట్రంప్ ప్రభుత్వం కఠినమైన వీసా విధానాల వల్ల చాలా మంది భారతీయ విద్యార్థులు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. సరైన సమయంలో సరైన న్యాయ సహాయం పొందడం ద్వారా వీసా సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే, విద్యార్థులు కూడా తమ ప్రవర్తనతో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
