Begin typing your search above and press return to search.

దాడికి ముందే ట్రంప్ ను బెదిరించిన ఇరాన్... ఏమని అంటే..?

అమెరికా మూడు అణుకేంద్రాలపై దాడులు చేయకముందే.. ఇరాన్‌ అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌ కు బెదిరింపు సందేశాలు పంపిందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   23 Jun 2025 9:24 PM IST
దాడికి ముందే ట్రంప్ ను బెదిరించిన ఇరాన్... ఏమని అంటే..?
X

పశ్చిమాసియా రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఇరు దేశాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ పై అమెరికా దాడికి తెగబడింది. అయితే.. అంతకంటే ముందు హుతీలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇరాన్ కూడా అమెరికాను హెచ్చరించిందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. అయినా ట్రంప్ తగ్గలేదని తెలుస్తోంది.

అవును... ఇరాన్‌ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ తో అమెరికా జట్టుకడితే.. ఎర్ర సముద్రంలోని అగ్రరాజ్య నౌకలు, యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుంటాం అంటూ హూతీ నుంచి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థ మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ యహ్యా సారీ ఓ వీడియో విడుదల చేశారు. అయితే.. ఈ విషయాన్ని ట్రంప్ లైట్ తీసుకున్నట్లున్నారు. ఈ సమయంలో.. స్లీపర్ సెల్స్ పేరు చెప్పి ఇరాన్ కూడా బెదిరించినట్లు చెబుతున్నారు.

అమెరికా మూడు అణుకేంద్రాలపై దాడులు చేయకముందే.. ఇరాన్‌ అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌ కు బెదిరింపు సందేశాలు పంపిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఇరాన్ పై దాడికి పాల్పడితే తమ స్లీపర్‌ సెల్స్‌ అమెరికాలో భయోత్పాతం సృష్టిస్తారని హెచ్చరించింది. ఇటీవల కెనడాలో జరిగిన జీ7 సదస్సులో ఉండగా.. ఓ మధ్యవర్తి ద్వారా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఈ హెచ్చరికను ఇరాన్‌ చేరవేసిందని ఎన్‌.బీ.సీ న్యూస్‌ పేర్కొంది.

ఇదే సమయంలో... పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకొంటామని టెహ్రాన్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకూడదని ఫిక్సైన ట్రంప్.. దేశంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని, తాను అనుకున్న పని పూర్తి చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జీ7 నుంచి ట్రంప్ తిరుగు ప్రయాణమై జాతీయ భద్రతపై హడావుడిగా మీటింగ్‌ లు నిర్వహించారని చెబుతున్నారు.

ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వాయుసేన తమ కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం... ఇరాన్‌ లోని ఫోర్డో, ఇస్ఫహాన్‌, నతాంజ్‌ అణు కేంద్రాలపై విరుచుకుపడిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో... అమెరికాలోని ప్రధాన నగరాల్లోని లా ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ అధికారులను హైఅలర్ట్‌ లో ఉంచారు. యూదులపై హింస, అల్లర్లు చోటుచేసుకోవచ్చని ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది.

కాగా... పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్‌ కు మద్దతుగా ఇరాన్‌ అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా అమెరికా అత్యంత శక్తిమంతమైన బాంబర్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడికి 120కి పైగా వివిధ రకాల విమానాలు, క్షిపణులను వాడిన అగ్రరాజ్యం... 14 బంకర్‌ బస్టర్‌ బాంబులను కూడా అణుకేంద్రాలపై జారవిడిచింది.