Begin typing your search above and press return to search.

బిగ్ ఇష్యూ... యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. 'ఫోర్డో'పై దాడులు!

ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 9:38 AM IST
బిగ్  ఇష్యూ... యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. ఫోర్డోపై దాడులు!
X

ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ పై దాడులు చేయాలా వద్దా అనే విషయంపై అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటారంటూ వైట్ హౌస్ ప్రకటన చేసిన 48 గంటల్లోనేపే ఇరాన్ పై అమెరికా దాడులు చేసింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా సొషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అవును... ఇరాన్‌ లోని అత్యంత కీలకమైన భూగర్భ అణుస్థావరం ఫోర్డో తో పాటు నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికన్ దళాలు సమన్వయంతో వైమానిక దాడులు నిర్వహించాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యతో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా ప్రత్యక్షంగా ఎంట్రీ ఇచ్చినట్లయ్యింది.

ఇందులో భాగంగా.. అమెరికా బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో ఇరాన్‌ పై విరుచుకుపడింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్... మిషన్ పూర్తైనట్లు ధృవీకరించారు. ఈ సందర్భంగా అమెరికా సైన్యాన్ని అభినందించారు. ప్రపంచంలో మరొక సైన్యం ఇలా చేయగలిగింది లేదని చెబుతూ.. 'ఇప్పుడు శాంతికి సమయం' అని ఆయన పేర్కొన్నారు.

'ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ సహా ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై మేము మా విజయవంతమైన దాడిని పూర్తి చేసాము. ఇరాన్‌ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అన్ని విమానాలు ఇరాన్ వైమానిక స్థలం వెలుపల ఉన్నాయి. బాంబుల పూర్తి పేలోడ్‌ ను ఫోర్డోలో జారవిడిచారు' అని తెలిపారు.

ఇదే సమయంలో... ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు ప్రపంచానికి ఒక చారిత్రాత్మక క్షణమని చెప్పిన ట్రంప్... ఈ యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ఇప్పుడు అంగీకరించాలని సూచించారు.

ఈ దాడులకు అమెరికా రెండు బీ2 బాంబర్ విమానాలను ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఈ తరహా బాంబులను అమెరికా ఉపయోగించడం ఇదే మొదటిసారని అంటున్నారు. ఆపరేషన్‌ కు ముందు రోజు రాత్రి ఫోన్‌ లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు దాడుల గురించి ట్రంప్ వ్యక్తిగతంగా తెలియజేసినట్లు అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి!

సుమారు 13,600 కిలోలు (30,000 పౌండ్ల) బరువున్న బంకర్ బస్టర్ బాంబుతో కూడిన అమెరికన్ స్టెల్త్ బాంబర్లు మాత్రమే ఫోర్డో వంటి భూమిలో లోతుగా ఉన్న అణు కేంద్రాలను చేరుకోగలవని, ధ్వంసం చేయగలవని అమెరికాతో పాటు ఇజ్రాయెల్ అధికారులు చెబుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటితోనే దాడులు చేసినట్లు తెలుస్తోంది.