Begin typing your search above and press return to search.

ముగ్గురు మనోళ్ల ప్రాణాలు తీసిన అమెరికా దాడి.. నిబంధనలు చెప్పేదేంటి?

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఒమన్ తీరంలో అమెరికా సైన్యం దాడి జరిపింది.

By:  Garuda Media   |   12 Jun 2026 12:42 PM IST
ముగ్గురు మనోళ్ల ప్రాణాలు తీసిన అమెరికా దాడి.. నిబంధనలు చెప్పేదేంటి?
X

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఒమన్ తీరంలో అమెరికా సైన్యం దాడి జరిపింది. పలావు (దేశం) జాతీయ పతాకంతో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు రవాణా నౌకపై అమెరికా దాడి చేయగా.. సదరు రవాణా నౌకలోని ముగ్గురు భారతీయ సిబ్బంది మరణించారు ఇది నిన్నటి వార్తగా విన్నాం . ఇరాన్ - అమెరికా యుద్ధం నేపథ్యంలో అగ్రరాజ్యం విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఉల్లంఘించి.. ఇరాన్ నుంచి చమురును రవాణా చేస్తుందన్నది అమెరికా ఆరోపణ.

ఈ నేపథ్యంలో తాము విధించిన దిగ్బంధాన్ని ఉల్లంఘించి ఇరాన్ నుంచి చమురు రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు ఒమన్ గల్ఫ్ సమీపంలో వాణిజ్య నౌక ఇంజిన్ రూంను టార్గెట్ చేసుకొని క్షిపణి దాడి చేశారు. ఈ ఉదంతంలో ముగ్గురు భారతీయ సిబ్బంది మృతి చెందారు. డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ.. ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా.. చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్. మరణించిన ముగ్గురిలో ఒకరు ఏపీకి చెందిన వారు. నౌకలో మిగిలిన 21 మంది సురక్షితంగానే ఉన్నారు. ఈ ఉదంతంపై భారత్ అమెరికాకు తన ఆందోళనను వ్యక్తం చేసింది.

ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ఉన్నతాధికారిని పిలిపించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేయటంతో పాటు.. వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేసింది. ఇలాంటప్పుడు వచ్చే కొన్ని సందేహాల్లో ముఖ్యమైంది? మనోళ్లు జాగ్రత్తలు తీసుకోలేదా? అని..అయితే.. ఇక్కడ సిబ్బంది పాత్ర కంటే కూడా వారు పని చేసే వాణిజ్య నౌకలను నిర్వహించే సంస్థ ఆదేశాలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. తాజా ఉదంతంలో ఇదే జరిగింది.

అమెరికా మన మిత్రదేశం కదా? మరి దాడికి ఎందుకు చేశారు? దాడికి ముందు ముందస్తు హెచ్చరికలు చేశారా? అంటే.. చేసినట్లుగా అమెరికా చెబుతోంది. అయినా.. తమ హెచ్చరికల్ని పాటించకుండా ముందుకు వెళ్లటంతో దాడి చేసినట్లుగా చెబుతోంది. అదే సమయంలో నౌక మీద భారత జాతీయ పతాకం లేదు. కారణం.. ఇది పలావు అనే దేశానికి చెందింది. ఇక్కడే మరో సందేహం వస్తుంది. మనం అమెరికా రాయబారి కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారిని పిలిపించి తీవ్ర నిరసన తెలియజేశాం.

ఒకవేళ ఇలాంటి పరిస్థితి రివర్సులో జరిగి.. మనోళ్లు జరిపిన దాడిలో ముగ్గురు అమెరికన్లు చనిపోయి ఉంటే ఏం జరిగేది? అన్న ప్రశ్న వేసుకుంటే.. అమెరికా వేరేలా స్పందించేది. తక్షణం వాషింగ్టన్ లోని భారత రాయబారిని అమెరికా విదేశాంగ శాఖ తక్షణ పిలిపించి.. తీవ్రంగా నిలదీసేది. వైట్ హౌస్.. పెంగాన్ నుంచి భారత్ కు వ్యతిరేకంగా అత్యంత కఠిన పదాలతో కూడిన సందేహం విడుదలై ఉండేది. అక్కడితో ఆగకుండా.. భారత్ తో ఉన్న రక్షణ ఒప్పందాలు.. అత్యాధునిక సాంకేతిక బదిలీ లాంటి ఒప్పందాలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చేది. అవసరమైతే.. కొన్ని కఠిన నిబందనల్ని తీసుకొచ్చి.. వాణిజ్యంపై ఒత్తిడి తెచ్చేది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిజంగానే అమెరికాకు క్షిపణి దాడి తప్పించి..వేరే ప్రత్యామ్నాయం లేదా? అన్న ప్రశ్నతో పాటు.. అంతర్జాతీయ నిబంధనలు ఏం ఉన్నాయి? అన్నది చూస్తే... అమెరికా అహంకారం ఇట్టే అర్థమవుతుంది. క్షిపణి దాడి కాకుండా అమెరికా ఏం చేయొచ్చు? అన్నది చూస్తే.. మూడు ప్రాణాలు తీసిన అగ్రరాజ్య దుర్మార్గం ఇట్టే అర్థమవుతుంది.

అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం నిబంధనల్ని పాటించని వాణిజ్య నౌకలను సముద్రంలోనే నిలిపివేసే వీలుంది. లేదంటే.. జప్తు చేసే అవకాశం ఉంది. యుద్ధ క్షిపణులతో దాడి చేయటం కాకుండా.. ప్రత్యామ్నాయాలను ఎందుకు వాడలేదని ప్రశ్నించే వీలుంది. అంతేకాదు.. ఏ బ్లాక్ లిస్ట్ లో లేని వాణిజ్య నౌకలపై అమెరికా ఏకపక్షంగా దాడులు చేయటం అంతర్జాతీయ వాణిజ్య నియమాలకు విరుద్ధంగా చెప్పొచ్చు. తాము క్షిపణి దాడి జరిపిన నౌకలో భారత సిబ్బంది ఉన్నారని.. సిబ్బంది వివరాలు కూడా అమెరికా నౌకాదళానికి తెలుసని భారత నావికుల సంఘాలు చెబుతున్నాయి.

అమెరికా చర్యపై ప్రధాని నరేంద్రమోడీ బహిరంగంగా ఖండించి ఉండే వీలుంది. కాకుంటే.. అమెరికాతో వ్యవహారించే తీరు వేళ.. వ్యూహాత్మక మౌనమే మంచిదన్న అభిప్రాయం ఉంది. అమెరికాపై ప్రపంచ దేశాల ఒత్తిడిని తీసుకొచ్చేలా చొరవ చూపి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. అమెరికాను వేలెత్తి చూపే బదులు.. అమెరికా దిగ్బంధం విధించినప్పుడే ఆ మార్గంలో ఉన్న నౌకల్లో పని చేసే భారతీయులకు కేంద్ర మంత్రిత్వ శాఖ కఠినమైన ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. అదే జరిగితే.. మూడు విలువైన ప్రాణాలు పోకుండా ఉండేవని చెప్పక తప్పదు.