Begin typing your search above and press return to search.

ట్రంప్ తొందరపాటు నిర్ణయం.. ఐరోపా దేశాలకు ప్రాణసంకటం!

గత కొన్ని రోజులుగా రష్యా - అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రష్యా మీద ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Aug 2025 12:11 PM IST
ట్రంప్ తొందరపాటు నిర్ణయం.. ఐరోపా దేశాలకు ప్రాణసంకటం!
X

గత కొన్ని రోజులుగా రష్యా - అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రష్యా మీద ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రెండు జలాంతర్గాములను తిరిగి ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలిపారు. అయితే ఈ విషయంపై రష్యా తీవ్రంగా స్పందించింది. భయంతోనే సుంకాలను అమెరికా పెంచింది అని, అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యం క్షీణించడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోందని రష్యా ఆరోపణలు చేసింది. తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సుంకాలతో దేశాలపై రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు తీసుకొస్తోందని కూడా వ్యాఖ్యానించింది. అంతేకాదు అమెరికన్ జలాంతర్గాములు ఇప్పటికే యుద్ధ వీధిలో ఉన్నట్టు.. తాము ఈ ప్రక్రియకు భయపడడం లేదు అని కూడా రష్యా చెప్పడంతో.. ఇప్పుడు రష్యాను బెదిరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం మిత్ర దేశాలైన ఐరోపా దేశాలకు ప్రాణసంకటంగా మారింది.

అసలు విషయంలోకి వెళ్తే.. మధ్య శ్రేణి క్షిపణులను మోహరించకుండా మాస్కో- వాషింగ్టన్ ల మధ్య ఉన్న ఐఎన్ఎఫ్ (ఇంటర్మీడియట్ రేంజి న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ) ఒప్పందాన్ని ఏమాత్రం ఇకపై అనుసరించబోమని రష్యా ప్రకటించింది. పశ్చిమ దేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పును సృష్టించాయని రష్యా ఆరోపణలు కూడా చేసింది. అందుకే ఈ ఒప్పందాన్ని అనుసరించే పరిస్థితులు లేవని తేల్చి చెబుతూ.. రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది.

అందులో కొన్ని రకాల క్షిపణులను తాము మోహరించకుండా విధించుకున్న ఆంక్షలు.. ఇకపై పాటించము అని తెలిపింది. అమెరికా దళాలు ఫిలిప్పీన్స్ లో టైఫూన్ క్షిపణి లాంచర్లను మోహరించడం , ఆస్ట్రేలియా దగ్గర్లోని టెలిస్మాన్ సాబ్రే డ్రిల్స్ లో క్షిపణులను పరీక్షించడమే ఇందుకు ప్రధాన కారణంగా వెల్లడించింది. దీంతో మరొకవైపు ట్రంప్ చేపట్టిన చర్యలు కూడా దీనికి ఆజ్యం పోశాయి. ఇటీవల రష్యా మాజీ అధ్యక్షుడు మెద్విదేవ్ చేసిన ప్రకటనకు స్పందనగా.. రెండు ఒహైయో శ్రేణి అణు జలాంతర్గాములను యుద్ధ వీధిలో మోహరించేలా ఆదేశాలు జారీ చేసారు ట్రంప్..

నిజానికి 1987లో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, రష్యా5 అధినేత మిఖాయిల్ గోర్భచేవ్ ఈ ఐఎన్ఎఫ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే మధ్య శ్రేణి రేంజి క్షిపణుల మోహరింపును నిషేధించారు. 500 కిలోమీటర్ల నుంచి 5500 కిలోమీటర్ల మధ్యలోవి ఈ ఒప్పంద పరిధిలోకి వస్తాయి. అప్పట్లో ఈ ఐఎన్ఎఫ్ కారణంగా సోవియట్ అమెరికాలకు చెందిన దాదాపు 2,692 క్షిపణులను ధ్వంసం చేసినట్లు గణాంకాలు కూడా చెబుతున్నాయి. దీనిని ప్రచ్ఛన్న యుద్ధాన్ని మలుపు తిప్పిన సంధిగా భావిస్తారు. దీనివల్ల అమెరికా మిత్ర దేశాలైన ఐరోపా దేశాలకే ప్రధాన ముప్పు అని చెప్పవచ్చు.

కానీ 2019లో ట్రంప్ ఈ ఒప్పందం నుంచి అమెరికాను బయటకు లాగేసారు. అటు రష్యా సుదీర్ఘకాలంగా దీనిని ఉల్లంఘిస్తోందని.. ఎస్ఎస్సి- 8 క్షిపణులను మోహరించింది అని ఆయన నాడు ఆరోపించారు కూడా. దీనిని అప్పుడే మాస్కో తిరస్కరించింది. అయితే ఇప్పుడు మళ్లీ ట్రంప్ నుండీ అణు జలాంతర్గముల మోహరింపు ఆదేశాలు వెలువడిన మూడు రోజుల తర్వాత రష్యా కూడా ఇప్పుడు ఈ ఒప్పందం నుండి బయటకు వచ్చేస్తామని ప్రకటించింది. మొత్తానికి అయితే రష్యాను బెదిరించాలని చూసిన ట్రంప్ నిర్ణయాలు ఇప్పుడు అమెరికాకి మిత్ర దేశాలైన ఐరోపా దేశాలకే ప్రాణ సంకటనగా మారడం ఆశ్చర్యంగా మారింది.