Begin typing your search above and press return to search.

భారత్‌కు చైనా నుండే అత్యధిక ముప్పు.. బీజింగ్ వద్ద 1,000 అణ్వాయుధాలు

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చిన ఒక నివేదిక సంచలనం సృష్టిస్తోంది.

By:  Tupaki Desk   |   26 May 2025 12:05 PM IST
US Intel Report Flags Rising China Threat Nuclear Arsenal
X

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చిన ఒక నివేదిక సంచలనం సృష్టిస్తోంది. చైనా తన సైనిక శక్తిని వేగంగా ఆధునికీకరిస్తోందని, తైవాన్‌ను ఆక్రమించుకునే ప్రణాళికల్లో భాగంగా భారీగా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఈ నివేదిక వెల్లడించింది. అగ్రరాజ్యమైన అమెరికా రక్షణ నిఘా సంస్థ (USA Defense Intelligence Agency) విడుదల చేసిన ‘వరల్డ్‌వైడ్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌’ పేరుతో వచ్చిన ఈ నివేదిక, భారత్‌కు పొరుగు దేశాల నుంచి ఉన్న ముప్పు అంచనాలను కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా 2020 నాటికే చైనా వద్ద కనీసం 1,000 అణ్వాయుధాలు ఉన్నాయని ఇందులో అంచనా వేయడం ఆందోళన కలిగిస్తోంది.

అమెరికా నివేదిక ప్రకారం, భారత్ చైనాను తన ప్రధాన శత్రువుగా భావిస్తోంది. దీనికి అనుగుణంగానే ఢిల్లీ తన రక్షణ సంబంధిత నిర్ణయాలను తీసుకుంటోంది. బీజింగ్‌ను ఎదుర్కోవడానికి తన సైనిక బలాన్ని పెంచుకోవడంపై భారత్ దృష్టి సారిస్తోంది. నివేదికలో పేర్కొన్న కొన్ని ముఖ్య అంశాలను పరిశీలిస్తే.. తూర్పు ఆసియాలో బలమైన శక్తిగా ఎదగాలని చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలను కొనసాగిస్తోంది. తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలపై చైనా బహుముఖ ఒత్తిడిని పెంచడానికి ప్రయత్నిస్తోంది. వాణిజ్యం, దౌత్యం, భద్రత పరంగా ప్రపంచ నాయకత్వాన్ని అమెరికాకు సవాల్ చేస్తోంది. ఈ అంచనాలు భారత్ తన సరిహద్దు భద్రతను, రక్షణ సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

అగ్రరాజ్య రక్షణ నిఘా సంస్థ నివేదికలో చైనా ఆయుధ సంపత్తి గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 2025లో తమ మిలిటరీ బడ్జెట్‌ను 5.2 శాతం పెంచి 247 బిలియన్ డాలర్లు (సుమారు రూ.20.5 లక్షల కోట్లు) కేటాయిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అయితే, రక్షణ రంగంపై బీజింగ్ చేస్తున్న నిజమైన ఖర్చు ప్రకటించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గత ఏడాది చైనా అనధికారికంగా దాదాపు 304-377 బిలియన్ డాలర్లు (సుమారు రూ.25-31 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు అంచనా. చైనా వద్ద ఆపరేషనల్ న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఇప్పటికే 600 దాటాయి. 2030 నాటికి ఈ సంఖ్య 1,000కి పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2035 వరకు బీజింగ్ తన సైనిక శక్తిని పెంచుకుంటూనే ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.

అమెరికా నివేదికలో పాకిస్థాన్ గురించి కూడా ప్రస్తావించారు. పాకిస్థాన్‌కు సైనిక, ఆర్థికపరంగా చైనా నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నప్పటికీ, ఆ దేశం భారత్‌ను మాత్రం తమ ఉనికికే ముప్పుగా (existential threat) భావిస్తోందని నివేదిక పేర్కొంది. ఢిల్లీ సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని, పాకిస్థాన్ కూడా తన అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునికీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తోందని తెలిపింది. మొత్తంగా, ఈ నివేదిక దక్షిణాసియాలో రక్షణపరమైన సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చైనా, పాకిస్థాన్ నుంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి భారత్ తన రక్షణ వ్యూహాలను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది.