Begin typing your search above and press return to search.

ఇండియన్లకు అమెరికాలో ఉపశమనం

ముసాయిదా బిల్లులో బ్యాంకు ఖాతాలు , ఇతర ఆర్థిక సంస్థల ద్వారా జరిగే ట్రాన్స్‌ఫర్లు పన్ను మినహాయింపునకు అర్హమవుతాయని స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   1 July 2025 10:00 PM IST
ఇండియన్లకు అమెరికాలో ఉపశమనం
X

అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు (ఎన్నారైలకు) ఒక గుడ్ న్యూస్.. "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్" ద్వారా ప్రతిపాదించిన రెమిటెన్స్ పన్ను మోతాదును 5 శాతం నుంచి కేవలం 1 శాతానికి గణనీయంగా తగ్గించారు.. ఇది అమెరికాలో స్థిరపడిన కోటి మందికి పైగా భారతీయులకు ఒక పెద్ద ఊరటగా మారింది.

- పన్ను తగ్గింపు వివరాలు

ఈ బిల్లు ప్రకారం భారతదేశంలోని బంధువులకు పంపే వస్తువులపై ముందుగా 5 శాతం పన్ను విధించాలని భావించారు. అయితే తాజాగా ఆమోదించబడిన ముసాయిదా బిల్లులో ఆ మోతాదు కేవలం 1 శాతానికి పరిమితమైంది. అంతేకాదు అమెరికాలో జారీ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులపై పన్ను వర్తించదు. కేవలం నగదు, మనీ ఆర్డర్ లేదా క్యాషియర్ చెక్ ద్వారా పంపినప్పుడు మాత్రమే ఈ పన్ను విధిస్తారు.

ముసాయిదా బిల్లులో బ్యాంకు ఖాతాలు , ఇతర ఆర్థిక సంస్థల ద్వారా జరిగే ట్రాన్స్‌ఫర్లు పన్ను మినహాయింపునకు అర్హమవుతాయని స్పష్టం చేశారు. ఈ రెమిటెన్స్ పన్ను 2025 డిసెంబర్ 31 తరువాత ప్రారంభమయ్యే ట్రాన్స్‌ఫర్లకు మాత్రమే వర్తిస్తుంది.

- నేపథ్యం , ఆందోళనలు:

గత మే నెలలో అమెరికాలో ఉన్న భారతీయులు భారతదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను విధించాలని ప్రతిపాదించారు. ఈ పన్ను H1B వీసాదారులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లకూ వర్తిస్తుందని చెప్పగా అమెరికన్ పౌరులకు మాత్రం మినహాయింపు కల్పించారు. ఈ ప్రతిపాదన వెలువడినప్పటి నుంచి అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ రెమిటెన్స్ పన్నుతో భారతీయులపై ఏటా దాదాపు 1.6 బిలియన్ డాలర్ల భారం పడుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. ఈ అంచనాలు ప్రవాసుల ఆందోళనను మరింత పెంచాయి.

- బిల్లు ఆమోదం ప్రక్రియ

"బిగ్ బ్యూటిఫుల్ బిల్" మొదట హౌస్ ఆఫ్ రిపబ్లికన్స్‌లో 3.5 శాతంగా ఆమోదం పొందింది. అనంతరం సెనెట్‌లో బిల్లుకు 1 శాతంగా తక్కువగా మంజూరు చేశారు. మే 22న ఈ బిల్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో 214–215 ఓట్ల తేడాతో స్వల్ప మెజారిటీతో ఆమోదించబడింది. సెనెట్‌లో ఈ బిల్లు 51–49 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం.

ఈ బిల్లులో వైద్య సహాయ నిధుల తగ్గింపు, ఫుడ్ కూపన్ల తగ్గింపు, 3.8 ట్రిలియన్ డాలర్ల పన్ను రాయితీలు వంటి అంశాలపై పలువురు రిపబ్లికన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, చివరకు బిల్లు ఆమోదం పొందింది.

- ఎన్నారైలకు ఊరట

ఈ నిర్ణయం అమెరికాలో జీవిస్తున్న ఎన్నారై భారతీయులకు ఒక పెద్ద ఊరటగా నిలిచింది. పన్ను తగ్గించడంతో పాటు, క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలకు మినహాయింపు ఇవ్వడం, బ్యాంకు ఖాతాల ద్వారా జరిగే ట్రాన్స్‌ఫర్లకు పన్ను వర్తించకపోవడం వంటి అంశాలు ప్రవాసుల ఆర్థిక భారాన్ని కొంత మేర తగ్గించనున్నాయి. రాబోయే రోజుల్లో రెమిటెన్స్ పై ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ పన్ను తగ్గింపుతో పాటు ఇతర మినహాయింపులు ఎంతగా దోహదపడతాయో చూడాలి.