టారిఫ్‌ల ట్రంప్.. పాతికేళ్లుగా అదే శాలరీ... మరిదానిపై టారిఫ్‌లు?
అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న.. ఆ దేశానికి జలుబు చేస్తే ప్రపంచం తుమ్మతుంది అన్నది వాడుకలోని మాట.
By: Tupaki Desk | 9 Aug 2025 12:00 PM ISTఅమెరికా అంటే ప్రపంచ పెద్దన్న.. ఆ దేశానికి జలుబు చేస్తే ప్రపంచం తుమ్మతుంది అన్నది వాడుకలోని మాట. అలాంటి దేశానికి అధ్యక్షుడైన ట్రంప్.. టారిఫ్‌లు టారిఫ్‌లు అంటూ కలవరిస్తూ ప్రపంచ దేశాలపై పడుతున్నారు. తాజాగా భారత్ ఈ టారిఫ్‌ల బాదుడు జాబితాలో చేరింది. ట్రంప్ అంటేనే అపర కుబేరుడు. పెద్ద వ్యాపారి. మరి ఆయనే అధ్యక్షుడు అయితే ఎంత శాలరీ ఉంటుంది? అనే మాట తాజా పరిణామాల మధ్య చర్చనీయం అవుతోంది.
అందరికంటే ఘనుడు..!
అగ్రరాజ్యం అనే హోదాను 35 ఏళ్లుగా అనుభవిస్తోంది అమెరికా. ఈ క్రమంలో ఐదారుగురు అధ్యక్షలు మారారు. క్లింటన్, బుష్, ఒబామా, ఇప్పుడు ట్రంప్ (నాలుగేళ్ల విరామం తర్వాత) రెండోసారి ప్రెసిడెంట్‌లుగా ఉన్నారు. అయితే, అందరికంటే ఎక్కువగా ట్రంప్ వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. తన నిర్ణయాలు.
జీతం మాత్రం అందే..
అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికే పెద్ద దిక్కు. అలాంటి పదవిలో ఉన్నవారి జీతం ఎంతనో తెలుసా? ప్రస్తుతం ఏడాదికి 4 లక్షల డాలర్లు. భారత రూపాయిల్లో రూ.3.36 కోట్లు. దీనిని 12 నెలలకు చూస్తే.. నెలకు రూ.28 లక్షలు అన్నమాట. అయితే, ఇది జీతం మాత్రమే. ఖర్చులకు, ప్రయాణాలకు, వినోదానికి వేరే చెల్లింపులు ఉంటాయి. ఖర్చలకు అదనంగా 50 వేల డాలర్లు, ప్రయాణ ఖాతా లక్ష డాలర్లు, వినోద బడ్జెట్ 19 వేల డాలర్లు ఉంటుంది. కాగా, చివరగా అమెరికా అధ్యక్షుడి జీతం పెరిగింది ఎప్పుడో తెలుసా..? 2001లో. అంటే, 25 ఏళ్ల కిందట. ఇన్నేళ్లలో ప్రపంచం అంతా మారిపోయింది. టెక్నాలజీ ఊహించనంతగా పెరిగింది. కానీ, అమెరికా ప్రెసిడెంట్ జీతం పెరగకపోవడం గమనార్హం.
ఇక అధ్యక్షుడు వైట్ హౌస్‌లో నివసించడంతో సహా ఇతర ప్రయోజనాలు పొందుతారు. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జీతం 2వేల డాలర్లు. ఈ జీతాన్ని ఆయన వైట్ హౌస్ పునరుద్ధరణ కోసం విరాళంగా ఇవ్వడం విశేషం. కాగా, అధ్యక్షుడికి జీతంతో పాటు అయ్యే ఖర్చు 5.69 లక్షల డాలర్ల కంటే ఎక్కువే. భారతీయ కరెన్సీలో రూ.4.7 కోట్లు అన్నమాట. మాజీ అధ్యక్షులకు
2.30 లక్షల డాలర్లు (రూ.1.93 కోట్లు) వార్షిక పెన్షన్ అందుతుంది. ప్రయాణభత్యాలు, కోరుకున్నచోట నివాసం, సిబ్బందిని కల్పిస్తారు.
కొసమెరుపుః అమెరికా అంటే మూడు భారత దేశాలంత పెద్దది. కానీ అమెరికాలో అర శాతం కూడా ఉండదు సింగపూర్. దీని ప్రధాని ఏడాదికి 11.6 లక్షల డాలర్లు (రూ.13.44 కోట్లు) వేతనం. ఇక అమెరికా అధ్యక్షుడికి అనేక మినహాయింపులున్నా పన్ను చెల్లింపు మాత్రం తప్పదు. సాధారణ పౌరుల్లాగే ట్యాక్స్ కట్టాల్సిందే.
