ఆఫీసు లేదు.. పని లేదు.. కానీ ఉద్యోగం ఉంది.. యూఎస్‌లో భారీ జాబ్ ఫ్రాడ్ బట్టబయలు
ముఖ్యంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ముసుగులో జరుగుతున్న ఈ మోసంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం.
By: A.N.Kumar | 13 May 2026 3:41 PM ISTఅమెరికాలో చదువు ముగించి.. మంచి ఉద్యోగంతో కెరీర్ ప్రారంభించాలనుకునే విదేశీ విద్యార్థులను టార్గెట్ చేస్తూ సాగుతున్న ఒక భారీ నెట్‌వర్క్‌ను అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్.ఎస్.ఐ) అధికారులు బట్టబయలు చేశారు. ముఖ్యంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ముసుగులో జరుగుతున్న ఈ మోసంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం.
అసలు ఏమిటీ ఓపీటీ వివాదం?
అమెరికాలో ఎఫ్-1 వీసాపై ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు, కోర్సు పూర్తయ్యాక ఏడాది పాటు (ఎస్.టీ.ఈ.ఎం ) రంగాల వారికైతే మరో రెండేళ్లు అదనంగా సంబంధిత విభాగంలో పని చేసేందుకు ప్రభుత్వం ఇచ్చే అనుమతే ఈ ఓపీటీ. అయితే, నిర్ణీత సమయంలోగా ఉద్యోగం సాధించకపోతే విద్యార్థులు స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడిని ఆసరాగా చేసుకున్న కొన్ని ముఠాలు "నకిలీ ఉద్యోగాల" ఎర వేస్తున్నాయి.
వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాలు
ఇటీవల టెక్సాస్‌లో నిర్వహించిన దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. వెబ్‌సైట్లు, ఆఫర్ లెటర్లు, పేరోల్ రికార్డులు అన్నీ పక్కాగా ఉన్నాయి. కానీ తీరా అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే అక్కడ కేవలం ఖాళీ గదులు లేదా తాళం వేసిన షెడ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి.
ముగ్గురు ఉద్యోగులు.. 500 మంది విద్యార్థులు
ఒక చిన్న ఆఫీసులో కేవలం ముగ్గురు మాత్రమే పనిచేస్తుండగా రికార్డుల్లో మాత్రం 500 మంది విద్యార్థులు అక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు చూపించారు. ఈ కంపెనీల ప్రతినిధులను ప్రశ్నిస్తే "మా హెచ్ఆర్ టీమ్ ఇండియాలో ఉంది" అని సమాధానం ఇవ్వడం అధికారులను ఆశ్చర్యపరిచింది.
దర్యాప్తు సంస్థల ఫోకస్..తీగ లాగితే హైదరాబాద్ డొంక కదులుతోందా?
ఈ స్కామ్ వెనుక కోఆర్డినేటెడ్ నెట్‌వర్క్ ఉందని అమెరికా ఏజెన్సీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులు భారత్‌లోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుండి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.వందలాది కంపెనీలకు ఒకే రకమైన డిజైన్, కంటెంట్ ఉండటం... ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండానే ఆఫర్ లెటర్లు జారీ చేయడం...ఒకే చిన్న గది చిరునామాతో పదుల సంఖ్యలో కంపెనీల రిజిస్ట్రేషన్ కావడం అనుమానాలకు తావిచ్చింది.
విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు
ఈ స్కామ్‌లో చిక్కుకున్న విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఇందులో రెండు రకాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. తెలియక మోసపోయిన వారు.. నిజమైన ఉద్యోగం అనుకొని కన్సల్టెన్సీల ద్వారా చేరిన వారు.. తెలిసి అక్రమ మార్గం ఎంచుకున్న వారున్నారు. కేవలం వీసా స్టేటస్ కాపాడుకోవడానికి ఫేక్ పేరోల్ రన్ చేస్తున్న వారు కూడా ఉన్నారు.
ప్రమాదం ఏమిటి?
తప్పు నిరూపితమైతే ఆ విద్యార్థుల వీసాలు రద్దు కావడమే కాకుండా వారిపై శాశ్వత నిషేధం విధించే అవకాశం ఉంది. భవిష్యత్తులో వారు మళ్ళీ అమెరికా గడ్డపై అడుగుపెట్టడం అసాధ్యం కావచ్చు.
నిపుణుల హెచ్చరిక.. జాగ్రత్త వహించండి!
అమెరికాలో ఉన్న విద్యార్థులు కన్సల్టెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ భౌతిక ఉనికిని తనిఖీ చేయండి. గూగుల్ రివ్యూలు, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్ , ఆఫీస్ అడ్రస్‌లను వెరిఫై చేసుకోండి. కేవలం డబ్బులు కడితే ఉద్యోగం ఇస్తామనే వారిని నమ్మకండి.
ఓపీటీ వ్యవస్థలో ఉన్న లొసుగులను అమెరికా ప్రభుత్వం ఇప్పుడు సీరియస్‌గా తీసుకుంది. రానున్న రోజుల్లో ఫిజికల్ ఆడిట్లు, రియల్ టైమ్ వెరిఫికేషన్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు అడ్డదారుల జోలికి వెళ్ళకుండా, చట్టబద్ధమైన మార్గాల్లోనే కెరీర్‌ను నిర్మించుకోవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
