బిగ్ అలెర్ట్: తెలుగు వాళ్లే టార్గెట్.. యూఎస్ కొత్త ఆపరేషన్!
తెలుగు వాళ్లే టార్గెట్ గా అమెరికా సరికొత్త ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ విషయం యావత్ తెలుగు మాట్లాడే ప్రజలందరికీ భారీ షాక్ అని చెప్పవచ్చు.
By: Madhu Reddy | 24 Jan 2026 10:55 AM ISTతెలుగు వాళ్లే టార్గెట్ గా అమెరికా సరికొత్త ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ విషయం యావత్ తెలుగు మాట్లాడే ప్రజలందరికీ భారీ షాక్ అని చెప్పవచ్చు. ప్రత్యేకించి తెలుగు వాళ్ళనే అమెరికా ఎందుకు టార్గెట్ చేస్తోంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత చేసిన మొదటి పని వలసవాదాన్ని ఉక్కుపాదంతో అణిచేయడం.
ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హామ్ ల్యాండ్ సెక్యూరిటీ తరఫున ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కి అధికారాన్ని కట్టబెట్టారు. అందులో భాగంగానే ఇప్పటివరకు అమెరికా భద్రత పేరిట గృహహింస, లైంగిక దాడులు, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల కేసులు వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని ICE.. లోకల్ పోలీసులతో గుర్తించి అరెస్టులు చేయించి మరీ చర్యలు తీసుకునేది. అయితే ఇప్పుడు దృష్టి తెలుగు ప్రజల వైపు మళ్ళింది .అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని.. వారిపై అధికారులు దాడులు, సోదాలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తూ.. నకిలీ పత్రాలతో ఉంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులే లక్ష్యంగా.. నకిలీ గ్రీన్ కార్డులు ఉపయోగిస్తున్న వారిపై , అలాగే నకిలీ పత్రాలను ఉపయోగించి విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులపై ఐసీఈ దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పని ప్రదేశాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తో పాటు ఇళ్లపై కూడా ఐసిఈ దాడులు జరుపుతున్నట్లు సమాచారం.
ఎవరైతే నకిలీ పత్రాలతో ఉద్యోగం చేస్తున్నారో లేదా కాలేజీల్లో చేరి విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారో అలాంటి తెలుగు ప్రజలు , విద్యార్థులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని అమెరికాలో అరెస్టులు జరుగుతుండడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. వీసా నిబంధనలు పాటించని వారిని ఐసీఈ నిర్బంధించి స్వదేశానికి తరలించే ప్రక్రియ ఇప్పుడు వేగవంతం చేసింది కాబట్టి ముఖ్యంగా తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా మిన్నేసోటాలోని సెయింట్ లూయిస్ పార్కులో ఒక భారతీయ రెస్టారెంట్లో పని చేస్తున్న ఇద్దరు విద్యార్థులను అధికారులు అరెస్టు చేశారు. అలాగే ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేసే ఉద్యోగిని ఏకంగా కంపెనీకి వెళ్లి మరి సంకెళ్ళు తగిలించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఇకపోతే ఈ రెండు కేసుల్లో తమ వద్ద అధికారిక పత్రాలు చూపించినా.. తమకేం తెలియదని వాళ్లు ఎంత మొత్తుకున్నా సరే అక్కడ అధికారులు వినలేదట. ఎవరు ఊహించని పరిస్థితుల్లో.. చాలా అధ్వానంగా ఉండే డిటెన్షన్ సెంటర్లలో గంటల తరబడి కూర్చోబెట్టి ఆఖరికి పంపించినట్లు సమాచారం.
నిజానికి అమెరికాకు ఉన్నత విద్య కోసం భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వెళుతూ ఉంటారు. ముఖ్యంగా స్టూడెంట్ వీసాపై ఉన్నవారు ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కానీ అమెరికా వీసా నిబంధన ప్రకారం క్యాంపస్ వెలుపల నిర్దిష్ట గంటలకు మించి పనిచేయడం చట్టరీత్యా నేరం. అక్రమంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తే అరెస్టులు తప్పవని గత కొంతకాలంగా ఐసిఈ హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రంప్ పదవిలోకి వచ్చాక తనిఖీలు మరింత ఉదృతం చేసింది ఐసిఈ . అయితే ఇప్పుడు ప్రత్యేకించి భారతీయులను అందులోనూ తెలుగువారిని టార్గెట్గా చేసుకొని తనిఖీలు చేయడం సంచలనంగా మారింది.
అయితే సరైన వీసా, పత్రాలు కలిగివున్న తెలుగు ప్రజలు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని .. చట్ట విరుద్ధంగా ఉంటున్న వారికి మాత్రమే ఈ దాడుల వల్ల మొప్పుపొంచి ఉందని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
