Begin typing your search above and press return to search.

రూ.2222 కోట్ల విలువైన నిఘా డ్రోన్ నష్టపోయామన్న యూఎస్

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2వేల కోట్లకు పైనే విలువైన నిఘా డ్రోన్. అత్యంత అత్యాధునికమైన ఈ నిఘా డ్రోన్ ను తాజాగా అగ్రరాజ్యం అమెరికా నష్టపోయిన వైనంపై గడిచిన కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది.

By:  Garuda Media   |   16 April 2026 11:03 AM IST
రూ.2222 కోట్ల విలువైన నిఘా డ్రోన్ నష్టపోయామన్న యూఎస్
X

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2వేల కోట్లకు పైనే విలువైన నిఘా డ్రోన్. అత్యంత అత్యాధునికమైన ఈ నిఘా డ్రోన్ ను తాజాగా అగ్రరాజ్యం అమెరికా నష్టపోయిన వైనంపై గడిచిన కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. తాజాగా ఈ నిఘా డ్రోన్ మీద అమెరికా క్లారిటీ ఇవ్వటమే కాదు.. నిఘా డ్రోన్ (ఎంక్యూ 4సీ)ను నష్టపోయామని ఒప్పుకుంది. ఈ విషయాన్ని తాజాగా అమెరికా నేవీ ధ్రువీకరిస్తూ.. ఎంక్యూ 4సీ ట్రైటన్ పై ఎలాంటి దాడి జరగలేదని.. సాంకేతిక లోపంతో కూలిపోయినట్లుగా పేర్కొంది. అంతేకాదు.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హామీ జరగలేదని వెల్లడించింది.

అంతేకాదు.. ఈ అంశంపై అమెరికా నేవీ వాదన ప్రకారం అంతర్జాతీయ గగనతలంలో హర్మూజ్ జలసంధిపై గస్తీలో ఉండగా.. ట్రైటన్ అకస్మాత్తుగా అత్యవసర కోడ్ ను రిలీజ్చేసి 50వేల అడుగుల ఎత్తు నుంచి 10వేలఅడుగుల ఎత్తుకు దిగొచ్చింది.అనంతరం కనిపించకుండా పోయింది. అమెరికా నేవీ సేఫ్టీ కమాండ్ దీనిని క్లాస్ ఏ ప్రమాదంగా వర్గీకరించటం గమనార్హం. ఎప్పుడైనా 2 మిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని.. ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా ధ్వంసం కావటాన్ని క్లాస్ ఏ ప్రమాదంగా పేర్కొంటారు. అయితే..ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందన్న విషయాన్ని వెల్లడించలేదు. అత్యంత విలువైన నిఘా డ్రోన్ ను నష్టపోయినట్లుగా మాత్రమే వెల్లడించింది.

ఇక్కడే ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. అదే సమయంలో ఇంతకూ అమెరికా వాదన వాస్తవానికి దగ్గరగా ఉందా? ిరాన్ చేసిన ప్రకటన వాస్తవానికి దగ్గరగా ఉందా? అన్నది అసలు ప్రశ్న. రక్షణ రంగానికి సంబంధించిన నిపుణులు.. అంతర్జాతీయ మీడియా రిపోర్టులను చూసినప్పుడు కొన్నిఆసక్తికర వాదనలు.. వాస్తవాలు కనిపిస్తాయి. వాటిల్లోకి వెళితే..

డ్రోన్ కూలిపోయే ముందు కోడ్ 7700 అనే అంతర్జాతీయ ఎమర్జెన్సీ సిగ్నల్ పంపటం వాస్తవం. సాధారణంగా శత్రువు క్షిపణి నేరుగా తగిలితే డ్రోన్ క్షణాల్లో ముక్కలైపోతుంది. సిగ్నల్ పంపే అవకాశం ఉండదు. కానీ.. ఈ ఉదంతంలో డ్రోన్ సిగ్నల్ పంపిదంటే.. అది సాంకేతిక లోపమైనా కావొచ్చు. ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వల్ల నియంత్రణ కోల్పోయి ఉండొచ్చన్నది ఒక వాదన. మరో వాదన చూస్తే.. రాడార్ డేటా ప్రకారం ఆ డ్రోన్ 50వేల అడుగుల ఎత్తు నుంచి కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో 10 వేల అడుగుల కంటే కిందకు పడిపోయింది. ఇంత వేగంగా పడిపోవటం అన్నది ఏదైనా క్షిపణి కారణంగానే జరిగే వీలుంది. పూర్తిగా కాకున్నా.. ఒక మోస్తరు నష్టంతో జరిగి ఉండొచ్చన్నది మరో వాదన.

ఈ ఘటన జరిగిన హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ఉద్రిక్తత ఉన్న ప్రాంతం. ఆ సమయంలో అమెరికా.. ఇరాన్ మధ్య దాడులు జరుగుతున్న వేళ.. అత్యంత విలువైన.. అత్యాధునికమైన డ్రోన్ దానంతట అదే కూలిపోయే అవకాశం చాలా తక్కువగా చెబుతున్నారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలే దానిని టార్గెట్ చేసుకొని ఉండొచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి అమెరికా స్పందించిన తీరు అనుమానం మరింత పెంచేలామారింది.

ఎందుకంటే.. అమెరికా ఐదు రోజులు మౌనంగా ఉండి.. చివరకు ‘క్లాస్ ఏ మిస్ హాప్’గా ప్రకటించింది. శత్రువు (ఇరాన్) కూల్చినట్లుగా ఒప్పుకుంటే అది యుద్ధాన్నిమరింత తీవ్రతరం చేసేలా చేస్తుంది. అదే సమయంలో తమ సాంకేతిక బలహీనత బయటపడుతుందని భావించొచ్చు. ఈ కారణాలతోనే అమెరికా దీనిని కేవలం ప్రమాదంగా పిలుస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే.. సాంకేతిక లోపం కంటే ఇరాన్ రక్షణ వ్యవస్థల దాడి కానీ.. ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ తోనే నష్టం ఎక్కువగా జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.