ఎవరి కోసం ఈ యుద్ధం? సొంత సైనికులకు తిండి పెట్టలేవా ట్రంప్?
బరిలోకి దిగి పోరాటం చేసే వాడికి ఏం ఇచ్చినా.. ఇవ్వకున్నా.. బలమైన ఆహారం.. బలమైన ఆయుధాలు.
By: Garuda Media | 19 April 2026 12:36 PM ISTబరిలోకి దిగి పోరాటం చేసే వాడికి ఏం ఇచ్చినా.. ఇవ్వకున్నా.. బలమైన ఆహారం.. బలమైన ఆయుధాలు. ఇవేమీ ఇవ్వకుండా పోరాడమంటే ప్రపంచంలో మరెవరూ పోరాడలేరు. ఆయుధాల విషయంలో ఎలాంటి సమస్య లేకున్నా.. సైనికులకు పెట్టాల్సిన తిండి విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న వైనం.. సొంత సైనికుల తిండి విషయంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్ మీద అమెరికా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో అమెరికన్ సైనికులకు అందుతున్న ఆహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.
రెండు పలచటి రోటీలు.. ఉడికించిన క్యారెట్ ముక్కలు.. కొంచెం మటన్.. ఇదే బాక్సుల రూపంలో అమెరికన్ సైనికులకు అందుతున్నరోజువారీ ఆహారం. పశ్చిమాసియాలో గత కొన్ని వారాలుగా యుద్ధ విధుల్లో పాలు పంచుకుంటున్న అమెరికన్ సైనికులకు ఇస్తున్న చాలీచాలని ఫుడ్ మెనూను తిట్టిపోస్తున్నారు. ఇరాన్ తోయుద్దం మొదలైన తర్వాత నుంచి వేలాది మంది సైనికులను అమరికా నుంచి పశ్చిమాసియాకు పంపటం తెలిసిందే.
అవసరమైతే హర్మూజ్ జలసంధి వద్ద అధిక్యత కోసం యూఎస్ఎస్ ట్రిపోలి.. యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ నౌకలు హర్మూజ్ జలసంధి వద్ద విధుల్లో పాల్గొంటున్నాయి. ఈ నౌకల్లో పని చేస్తున్న సైనికులు తమకు అందిస్తున్న పుడ్ ను తమ కుటుంబాలకు షేర్ చేసుకోవటంతో ఈ అరాచకం బయటకు వచ్చింది.కడుపు నిండా తిండి పెట్టకుండా యుద్ధం చేయమని చెప్పటం ఏం బాగుంటుందన్నది అసలు ప్రశ్న. ఇదిలా ఉంటే.. అమెరికాలోని కుటుంబాలు సైనిక విధుల్లో ఉన్న తమ వారికి ఫుడ్ పంపే వీలు లేకపోవటంతో చాలీచాలని తిండితో కిందా మీదా పడుతున్న పరిస్థితి.
హర్మూజ్ జలసంధికి దగ్గరగా మొహరించిన ట్రిపోలి నౌక సైజు ఎంత పెద్దదంటే.. ఆ నౌకలో 3500 మంది సైనికులు ఉంటారు.ఇరాన్ కు చేరుగా ఉన్న ఈ నౌక మార్చి 27 నుంచి అక్కడే ఉంది. ఆహార సమస్య ఈ నౌకలోని సైనికులకు తీవ్రంగా వేధిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకప్పుడు నాణ్యమైన ఆహారం గురించి మాట్లాడేవారని.. ఇప్పుడు ఆహారం దొరికితే అదే పది వేలు అన్నట్లుగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది. సైనికులు ఎప్పుడూ ఆకలితో ఉండాల్సిన దుస్థితి నెలకొందన్న వాదన వినిపిస్తోంది.
ఇరాన్ యుద్ధంలో భాగమైన మరో విమాన వాహన నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విషయానికి వస్తే.. అందులో 4500 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా టాయిలెట్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే.. అందులోని టాయిలెట్లు పని చేయని కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఉద్రిక్తతలు చల్లారని వైనం ఒకవైపు.. నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధం అమెరికా సైనికులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఇదంతా చూసిన తర్వాత మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. ఈ యుద్ధం ఎవరి కోసం ట్రంప్? అన్న ప్రశ్నతో పాటు.. సొంత సైనికులకు సరైన తిండి పెట్టని అధినేతగా ట్రంప్ నిలిచిపోతారన్న మాట వినిపిస్తోంది.
